పీడీఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్. బాల్ రాజ్

0 8,673

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఫ్రంట్ (పీడీఎస్ఎఫ్) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్. బాల్ రాజ్ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన పీడీఎస్‌ఎఫ్ రాష్ట్ర నిర్మాణ జనరల్ బాడీ సమావేశంలో నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. బాల్ రాజ్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతో, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం మరింత సమర్థవంతంగా పనిచేస్తానని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు, నిర్ణయాలకు కట్టుబడి విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడుతానని హామీ ఇచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం, నాణ్యమైన విద్య అందరికీ అందేలా ఉద్యమాలను మరింత ఉధృతం చేయడమే నూతన రాష్ట్ర కమిటీ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.విద్యా రంగాన్ని ప్రభావితం చేస్తున్న ప్రధాన సమస్యలపై నిరంతర పోరాటం కొనసాగిస్తామని బాల్ రాజ్ తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పన, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీ, ఫీజు రీయింబర్స్‌ మెంట్, స్కాలర్‌షిప్‌లను సకాలంలో విడుదల చేయడం, హాస్టల్ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. అదే విధంగా నూతన విద్యా విధానం (ఎన్ఈపీ2020)లో విద్యార్థి వ్యతిరేకంగా భావిస్తున్న అంశాలను వ్యతిరేకిస్తూ, ప్రభుత్వ విద్యను పరిరక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణతో పాటు ప్రభుత్వ విద్యాభివృద్ధికి పీడీఎస్‌ఎఫ్ కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికతో విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతమైన ఉద్యమాలు సాగుతాయని సమావేశంలో నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.