- విచారణ చేపట్టిన పోలీస్ శాఖ
- అనేక మంది నిరుద్యోగుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు
- విద్యాశాఖ ఫిర్యాదుతో కేసుల నమోదు
నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా విద్యాశాఖలో అక్రమంగా నియమకాలు చేపట్టి నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు గ్లోబల్ ఫౌండేషన్ పై విచారణ వేదిక సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలల్లోని కంప్యూటర్ ఆపరేటర్లు ఇతర సహాయకుల నియామకానికి సంబంధించి ఉచితంగానే నియమాకాలు చేపడతామని, తామే వేతనాలు చెల్లిస్తామని గ్లోబల్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఆపరేటర్ల నియామకాలు చేపట్టింది. ఈ నియామకాలలో నిరుద్యోగుల నుంచి భారీగా వసూలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో ఈ అక్రమ నియామకాలు చేపట్టి వసూలు జరిగాయి. జిల్లాలోని బాల్కొండ మండలంలో ఓ నిరుద్యోగి నుంచి 1,80,000 వసూలు చేశారు. మోర్తాడ్ మండలంలోని ముగ్గురు, కమ్మరిపల్లి మండలం ఎనిమిది మంది, భీమ్గల్ మండలంలోని పదిమంది, నందిపేట మండలంలోని ఇద్దరు నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. గత మూడు నెలల క్రితం బాల్కొండ మండలంలోని అభ్యర్థికి డబ్బుల వాసులకు సంబంధించి వ్యవహారం బయటకు రావడంతో జిల్లా విద్యాశాఖ గ్లోబల్ ఫౌండేషన్కు నోటీసులు జారీ చేసింది. అంతేగాక నిర్మల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి గ్లోబల్ ఫౌండేషన్ పేరిట భారీ నకిలీ నియామకాలు చేపట్టారు. ఈ వ్యవహారం పై రాష్ట్రవ్యాప్తంగా అక్రమ నియమాలు వెలుగులోకి రావడంతో జిల్లా విద్యాశాఖ గ్లోబల్ ఫౌండేషన్ ను తొలగించింది.. దీంతో గ్లోబల్ ఫౌండేషన్ తొలగిపోయిందన్న సమాచారం తెలుసుకున్న నిరుద్యోగులు ప్రస్తుతం జిల్లా విద్యాశాఖకు ఫిర్యాదులు చేస్తున్నారు. తమకు ఉద్యోగాలు ఇప్పిస్తారని లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు ఒక్కొక్కరుగా జిల్లా విద్యాశాఖకు ఫిర్యాదు చేస్తున్నారు. భీంగల్ మండలంలోని నలుగురు ఇటీవల జిల్లా విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు. ధర్పల్లి మండలాలకు చెందిన ఇద్దరు రెండు లక్షల రూపాయలు ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ కు సమర్పించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు కేసు నమోదు చేయనున్నారు. సుమారు 20 మంది గ్లోబల్ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ కు అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. డబ్బుల కోసం ప్రశ్నిస్తే తప్పించుకుని తిరుగుతున్నట్లు అందుబాటులోకి రావడం లేదని పేర్కొంటున్నారు. మరోవైపు గ్లోబల్ ఫౌండేషన్ నిర్వాహకులు అసలు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి ఉందని లక్షలాది రూపాయలు వసూలు చేసి స్పందించకపోవడం పై వారు ఈ ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. మరింత మంది బాధితులను కలిసి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. జిల్లా విద్యాశాఖ పోలీసులకు మరో మారు ఫిర్యాదు చేయనుంది.
