ఆగస్టు 30లోగా అన్ని గురుకుల విద్యాసంస్థల తనిఖీలు పూర్తి చేయాలి

0 10,030

 

. . . ప్రతి ఆర్‌సీవో వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి

 

. . . విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, కళల్లోనూ ప్రతిభను పెంపొందించాలి

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజెపీటీబీసీడబ్య్లూఆర్ఈఐఎస్) పరిధిలోని అన్ని గురుకుల విద్యాసంస్థలను ఈ ఏడాది ఆగస్టు 30లోగా పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, సురక్షిత వాతావరణం, మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బీసీ గురుకుల విద్యాసంస్థల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమంపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. గురుకుల విద్యాసంస్థల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా వాతావరణాన్ని కల్పించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రతి రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ (ఆర్సీఓ) వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కనీసం ఆరు గురుకుల విద్యాసంస్థలను సందర్శించాలని ఆదేశించారు. ఆర్‌సీవోలు కేవలం పర్యవేక్షణకే పరిమితం కాకుండా ప్రధాన కార్యాలయం, జిల్లా యంత్రాంగం, విద్యాసంస్థల మధ్య సమన్వయం కల్పించే సంధాన కర్తలుగా వ్యవహరించాలని సూచించారు. సొంత భవనాలు లేని గురుకుల విద్యాసంస్థలకు భూముల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందుకోసం సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమావేశమై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఏ నియోజకవర్గానికి అనుమతి పొందిన విద్యాసంస్థ అదే నియోజకవర్గ పరిధిలో భవనాలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అద్దె భవనాలకు చెల్లించే మొత్తంలో ఆరు శాతం నిధులను భవనాల మరమ్మతులకు తప్పనిసరిగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి విద్యాసంస్థలో రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను సమర్థవంతంగా అమలు చేసి భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తల్లిదండ్రుల నుంచి వచ్చే ఫిర్యాదులు, సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు ప్రధాన కార్యాలయానికి తెలియజేసి వాటిపై సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు పాఠ్యాంశాల్లోనే కాకుండా క్రీడలు, కళలు, వ్యక్తిత్వ వికాసం వంటి రంగాల్లోనూ ప్రోత్సాహం అందించి సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రతిభ గల విద్యార్థుల వివరాలు తెలియజేస్తే వారికి ప్రభుత్వం తరపున మరింత ప్రోత్సాహం అందిస్తామని ఆయన అన్నారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనుకాకుండా సైకాలజిస్ట్ లతో అవగాహన సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించారు. విద్యార్థులు శారీరక, మానసిక ఆరోగ్యంతో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఎక్కడా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరగకుండా వంటశాలలు, ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెల కనీసం 15 గురుకుల విద్యాసంస్థలను తాను, కమిషనర్, కార్యదర్శి అకస్మిక తనిఖీలు చేస్తామని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని ఆయన హెచ్చరించారు.మూసీ గురుకుల విద్యాసంస్థకు సొంత భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని మంత్రి వెల్లడించారు. విద్యార్థులతో విస్తృతంగా మొక్కలు నాటించి వాటి సంరక్షణ బాధ్యతను కూడా వారికి అప్పగించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి, ఎంజెపీటీబీసీడబ్య్లూఆర్ఈఐఎస్ కార్యదర్శి బడుగు సైదులు, డిప్యూటీ సెక్రటరీలు, రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

 

Inspections of all residential educational institutions must be completed by August 30.

Leave A Reply

Your email address will not be published.