మూడు వారాల్లో 559 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

0 9,907

 

. . . 31 మందికి జైలు శిక్ష

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో గత మూడు వారాల్లో 559 కేసులు నమోదయ్యాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. ఈ కేసుల్లో సంబంధిత కోర్టులు 31 మందికి వారం రోజుల జైలు శిక్ష విధించగా, మిగిలిన కేసుల్లో మొత్తం రూ.52.80 లక్షల జరిమానా విధించినట్లు సీపీ వెల్లడించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జూన్ 29, 2026 నుంచి జూలై 17, 2026 వరకు నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 559 మంది వాహనదారులను పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపర్చగా, కోర్టులు చట్ట ప్రకారం శిక్షలు విధించాయి. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ప్రజలకు పలు సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ ఆరు నెలల పాటు సస్పెండ్ చేయబడుతుందని తెలిపారు. అదే విధంగా మద్యం మత్తులో వాహనం నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమైతే బీమా (ఇన్సూరెన్స్) ప్రయోజనాలు లభించవని హెచ్చరించారు. మైనర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే, మైనర్‌తో పాటు వాహన యజమానిపై కూడా చార్జ్‌షీట్ నమోదు చేసి, జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ఒకటి కంటే ఎక్కువసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి జైలు శిక్ష తప్పదని కమిషనర్ స్పష్టం చేశారు. మోటార్ వెహికల్స్ చట్టం-1988కు 2019లో చేసిన సవరణల ప్రకారం, మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10 వేల వరకు జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందన్నారు. రెండోసారి పట్టుబడితే రూ.15 వేల వరకు జరిమానా లేదా మరింత కఠినమైన జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నందున, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపకుండా సహకరించాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.