. . . అసలైన ఉద్యమకారులకు గుర్తింపు, న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ యూనివర్సిటీ వేదికగా కీలక పాత్ర పోషించిన విద్యార్థి ఉద్యమకారులు మంగళవారం సమావేశమయ్యారు. తెలంగాణ యూనివర్సిటీ కామర్స్ బిల్డింగ్‌లోని సెమినార్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి సుమారు 25 మంది నాటి ఉద్యమకారులు హాజరై, తమ సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. ఈ సందర్భంగా డా. పిట్ల సరిత మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యూనివర్సిటీ విద్యార్థులుగా ఎన్నో త్యాగాలు చేసి ఉద్యమంలో పాల్గొన్నామని గుర్తు చేశారు. మెస్‌లు మూసివేసినా, అనేక ఇబ్బందులు ఎదురైనా ఉద్యమ లక్ష్యం నుంచి వెనక్కి తగ్గకుండా పోరాడామని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించడంలో యూనివర్సిటీ విద్యార్థులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో చదువులకు ఆటంకాలు ఎదురైనా తెలంగాణ సాధనే లక్ష్యంగా తమ విలువైన సమయాన్ని కేటాయించామని తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన కమిటీ కొంతమంది ఉద్యమకారుల నుంచి మాత్రమే అభిప్రాయాలు సేకరిస్తోందని, వాస్తవంగా ఉద్యమంలో పాల్గొన్న పలువురికి సరైన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నియమించిన కేకే కమిటీ నిజమైన ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో ఉద్యమకారులు తమ హక్కుల సాధన కోసం పలు డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని కేటాయించాలని కోరారు. అలాగే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లో పాల్గొన్న వారికి అమలు చేసిన విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణ ఉద్యమకారులకు కూడా సమాంతర రిజర్వేషన్ల ద్వారా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, గెస్ట్, పార్ట్‌టైమ్ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, వారి సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అదేవిధంగా ఉద్యమకారులకు ప్రత్యేక హెల్త్ కార్డులు, గుర్తింపు కార్డులు జారీ చేయాలని, ముఖ్యంగా మహిళా ఉద్యమకారులను ప్రత్యేకంగా గుర్తించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ ఉద్యమకారుల సమన్వయం కోసం అడ్‌హాక్ కమిటీని ఏర్పాటు చేశారు. యూనివర్సిటీలోని మిగతా ఉద్యమకారులను గుర్తించడం, వారందరినీ ఒక వేదికపైకి తీసుకురావడం, ప్రభుత్వం నియమించిన కేకే కమిటీతో సమన్వయం చేయడం వంటి బాధ్యతలను ఈ కమిటీ నిర్వహించనుంది. అడ్‌హాక్ కమిటీ సభ్యులుగా ఎల్‌బీ రవి కుమార్, డా. ఎన్. సౌందర్య, డా. ప్రసన్న, డా. ఎం. సిద్ధలక్ష్మి, డా. ఈ. శ్రీనివాస్ గౌడ్, డా. పుప్పాల రవి, డా. రవీందర్ నాయక్, బట్టు సురేష్, సంతోష్, బాలరాజు నాయక్, సుధాకర్, డా. రమేష్ నాయక్, డా. భరత్, పిల్లి శ్రీకాంత్, డా. పులి జైపాల్, డా. పీబీ సత్యంలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో డా. సరిత పిట్ల, పస్కా నర్సయ్య, వాసరి సాయినాథ్, ఎండల ప్రదీప్, పిల్లి శ్రీకాంత్, డా. పులి జైపాల్, డా. శ్రీనివాస్ గౌడ్, డా. పుప్పాల రవి, డా. సౌందర్య, డా. సిద్ధలక్ష్మి, డా. ప్రసన్న, విజయలక్ష్మి, స్వరూప, బాలరాజు నాయక్, సంతోష్, డా. రమేష్ నాయక్, డా. భరత్, డా. సత్యం, డా. రవీందర్ నాయక్, బట్టు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
. . . పిట్ల సరిత ప్రకటించిన కమిటీ తో మాకు సంబంధం లేదు : ఎండల ప్రదీప్
మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారుల సంఘం నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగిందని ఎండల ప్రదీప్ తెలిపారు. ఈ సందర్బంగా ఉద్యమ సందర్బంగా జరిగిన సంఘటనలను నెమరేసుకొన్నారు. ప్రభుత్వం వేసిన కేకే కమిటీ కి యూనివర్సిటీ తరపున ఒక నివేదిక ఇయాలని నిర్ణయం చేయడం జరిగిందన్నారు. అందరూ రాని కారణంగా మరో సారి కూర్చొవాలని నిర్ణయం జరిగిందని, కొంత మందికి పూర్తి అవగాహనా లేక కేకే కమిటీ ని తప్పుపట్టుతున్నారన్నారు. అవకాశం వచ్చినప్పుడు, విద్యార్ధి ఉద్యమకారులకు ఎలా న్యాయం చేయాలో ఆలోచించాలని, సరిత ప్రకటించిన కమిటీ తో ఈరోజు జరిగిన సమావేశానికి హాజరైన వారికి ఎలాంటి సంబంధం లేదని, పూర్తిగా సరిత వ్యక్తి గతంగా ప్రకటించారు కావున తొందర్లో తెలంగాణ ఉద్యమ కారుల సంఘం ను ప్రకటిస్తామన్నారు.
