టీకాలతో నియంత్రించే వ్యాధులపై జిల్లా స్థాయి శిక్షణ

0 9,331

 

. . . వ్యాధి నిరోదక టీకాల నాణ్యతను సమీక్షించాలి

 

. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టీకాల ద్వారా నియంత్రించగల వ్యాధులపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ట్రైనర్ ఆఫ్ ట్రైనిగా వ్యవహరించిన పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 8 జిల్లాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయగా, అందులో నిజామాబాద్ జిల్లా ఒకటిగా ఉందని తెలిపారు. ఇకపై వ్యాక్సిన్ ప్రివెన్టబుల్ డిసీజెస్ సిస్టమేటిక్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం పోర్టల్ ద్వారా టీకాలతో నియంత్రించే వ్యాధుల వివరాలను జిల్లా స్థాయిలో కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలను ఆయన వివరించారు. టీకాలతో నియంత్రించగల వ్యాధుల తీవ్రతను తగ్గించడం, ఒకే ప్రాంతంలో అకస్మాత్తుగా ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదైతే వాటిని గుర్తించి అవుట్‌బ్రేక్‌లను నియంత్రించడం, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాల నాణ్యతను సమీక్షించడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా పర్యవేక్షణ చేపట్టడం, నిర్ణీత సమయంలో అన్ని కార్యక్రమాలను పూర్తి చేయడం ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. పోలియో, మీజిల్స్-రూబెల్లా, డిఫ్తీరియా వంటి వ్యాధులకు సంబంధించి ఒకే ప్రాంతంలో సుమారు 5 కంటే ఎక్కువ కేసులు నమోదైతే దానిని అవుట్‌బ్రేక్‌గా పరిగణిస్తామని తెలిపారు.

 

District-level training on vaccine-preventable diseases

 

యాక్టివ్ కేస్ ఫైండింగ్ ద్వారా అక్యూట్ ఫ్లాసిడ్ పెరాలసిస్ వంటి కేసులను గుర్తించిన వెంటనే మల నమూనాలను సేకరించాలని సూచించారు. చర్మంపై దద్దుర్లతో కూడిన జ్వరం ఉన్న కేసుల్లో ముక్కు స్వాబ్, గొంతు స్వాబ్, సీరం శాంపిల్ లేదా మూత్ర నమూనాలను సేకరించి, నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం ప్యాకింగ్ చేసి హైదరాబాద్‌లోని ఐపీఎంకు పంపాలని చెప్పారు. అలాగే కేసు ఇన్వెస్టిగేషన్ ఫారాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. పోలియో ఏఎఫ్ పి కేసులకు సంబంధించి సంవత్సరానికి 10 కేసులను లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 2 కేసుల నమూనాలను పంపినట్లు తెలిపారు. మీజిల్స్ – రూబెల్లా కేసుల్లో సంవత్సరానికి 35 నమూనాల లక్ష్యానికి గాను 22 నమూనాలను పంపగా, అందులో 14 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ మాట్లాడుతూ టీకాలతో నియంత్రించగల వ్యాధులను సమగ్రంగా గుర్తించి, అవసరమైన నమూనాలను సేకరించి, నిబంధనల ప్రకారం పంపించాలని వైద్యాధికారులకు సూచించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం, ఇతర జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ఆరోగ్య మహిళ కార్యక్రమాలపై కూడా వైద్యాధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ అశోక్, ట్రైనర్ ఆఫ్ ట్రైనర్స్ డాక్టర్ అజ్మల్, డాక్టర్ శ్రావ్య, డీడీఎం పృథ్వి పాల్గొన్నారు. జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ రవీందర్, డాక్టర్ విద్య, డాక్టర్ సికందర్ నాయక్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శరణ్య, డాక్టర్ ప్రసన్న, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శిఖర, ఎస్‌ఓ రాజేశ్వర్, డిప్యూటీ డెమో దుర్గారావు, డీహెచ్‌ఈ గన్‌పూర్ వెంకటేశ్వర్లు, డీపీఓ విశాల, వినోద్‌తో పాటు వివిధ పీహెచ్‌సీ, సీహెచ్‌సీల వైద్యాధికారులు, రిపోర్టింగ్ అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

 

District-level training on vaccine-preventable diseases

Leave A Reply

Your email address will not be published.