. . . నిజామాబాద్ టిపిటిఎఫ్ అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పాలక వర్గ పార్టీ ప్రభుత్వం లోకి రాక ముందు విద్యా రంగానికి 15% కేటాయిస్తామని మాట ఇచ్చి నేటికి మూడో బడ్జెట్లో కూడా 8.23% శాతానికి దాటలేదని, విద్యా రంగానికి కనీసం 20 శాతం బడ్జెట్ కేటాయించాలని నిజామాబాద్ టిపటిఎఫ్ అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్ అన్నారు. ప్రభుత్వం వారిచ్చిన హామీల అమలులో అలసత్వం వహించకుండా విద్యా రంగ సమస్యల సాధనలో ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన తెలిపి మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలుగా గత ప్రభుత్వ కాలంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి అనేక మార్లు మన ఫెడరేషన్ గా, ఉపాధ్యాయ సంఘాల ఐక్య కూటమి (యుఎస్ పిసి) గా, ఇంకా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ గా కూడా ప్రాతినిథ్యాలు చేసినా ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందన్నారు. ఒక డీఎస్ సీ ద్వారా కొద్దిగా మెరుగైన స్టాఫ్ పాటర్న్ రావడం, 25000 మందికి పదోన్నతులు రావడం ఆహ్వానించదగిందే కానీ ఈ రెండు తప్ప ఏ ప్రయోజనం మెజారిటీ టీచర్లకు జరగలేదని, మోడల్ స్కూల్ లో పనిచేస్తున్న టీచర్లకు హెల్త్ కార్డులు ఇవ్వలేదని, పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినట్లుగా సిపిఎస్ రద్దు కాలేదని, ఓపిఎస్ తీసుకురాలేదని, ఎస్ఎస్ఎ లో పనిచేస్తున్న ఉద్యోగులకు మినిమం టైమ స్కేలు ఇస్తామని ఇప్పటివరకు ఏది కూడా అమలు చేయలేదని అన్నారు.

పాత ప్రభుత్వం వేసిన పీఆర్ సీ నివేదిక గడువు పెంచుకుంటూ పోవడమే తప్ప తెప్పించుకున్న పాపాన పోలేదని, రాష్ట్ర స్థాయి నాయకత్వాలు రిటైర్ అవుతున్నా, కొత్త నాయకులు వస్తున్నా, పీఆర్ సీ నియమించిన రోజుకి నేటికి జాతీయ ధరల సూచిక ప్రకారం జీవన వ్యయం పెరుగుతున్నా, నేటికి పీఆర్ సీ ప్రస్తావన చేయకపోవడం, బడ్జెట్ ప్రసంగంలో కనీసం ఒక హామీ లాగానైనా మాట్లాడక పోవడం బాధాకరమని తెలిపారు. ఇంకా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ప్రకటన రాగానే గత పీఆర్ సీ సూత్రం ప్రకారం గత రెండున్నర సంవత్సరాలుగా చెల్లించవలసిన 5 డీఏ లు (కరవుభత్యం) చెల్లించక పోవడం, ఉపాధ్యాయులుగా అవమానించడమే అని అన్నారు. గోరు చుట్టపై రోకటి పోటులా ఆకునూరి మురళి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో మన జీతాలు మార్కెట్ తో పోల్చినప్పుడు ఎక్కువగా ఉన్నాయనడం వారి బాధ్యతారాహిత్యానికి తార్కాణమని, ఇంతకీ ఏ మార్కెట్ జీతాలతో పోల్చారో వారికే తెలియాలని మండిపడ్డారు. మన జీతాలను ప్రైవేట్ టీచర్ల జీతాలతో పోల్చి వారి శ్రమ దోపిడీని ప్రామాణికం చేస్తూ ఆకునూరి మురళి కమిటీ తిరోగమన దిశగా ఆలోచించడం ఆక్షేపనీయమన్నారు. లక్షల కోట్ల రూపాయలు అనేక పథకాల పేరుతో సివిల్ కాంట్రాక్ట్ ల కోసం కేటాయించే ప్రభుత్వం మన డీఏ లు, పెన్షనర్ల ఆర్థిక చెల్లింపులు, జీపీఎఫ్, టీఎస్జిఎల్ఐ మెచ్యూరిటీ సొమ్ము, పీఆర్ సీ బకాయిలు చెల్లించడంలో ఖజానా సొమ్మంతా గత ప్రభుత్వం చేసిన అప్పులకే పోతుందని బీద పలుకులు పలుకడం నమ్మ శక్యంగా లేదని వాపోయారు. వైఐఐఆర్ఎస్, టీపీఎస్, టీఎఫ్ఎస్ ల పేరుతో కొత్త పాఠశాలలు స్థాపన కోసం ప్రణాళికలు చేస్తూ కేటాయింపులు చేయకపోవడం విడ్డూరమని, కేజీబీవీ ఉపాధ్యాయులకు రెగ్యులర్ స్కేల్ ఇవ్వాలని, సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ ఎంఈఓ లను భర్తీ చేసి పదోన్నతులు పూర్తి చేయాలని, రెసిడెన్షియల్ పాఠశాలలో పనివేళలు, టైం టేబుల్ ను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అరవింద్, వెంకట్ నరేందర్, చల్లా సత్యనారాయణ, మోహన్, మహేష్, అప్పారావు, కస్తూరి, నరేష్, ప్రవీణ్, శిరిష్, పేట నాయకులు నాంచారి శ్రీనివాస్, గోపిరెడ్డి, మురళి, మహిళ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.