కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లాకు నూతనంగా జిల్లా విద్యాశాఖ అధికారిగా (డీఈవో) బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున్‌ను తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) జిల్లా నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. జిల్లా, మండల స్థాయి బాధ్యులు డీఈవోను కలిసి విద్యాశాఖలో నెలకొన్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా జిల్లాలో కొనసాగుతున్న అక్రమ డిప్యూటేషన్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఉపాధ్యాయ సంఘాలన్నింటితో కలిసి సమన్వయ సమావేశం (కోఆర్డినేషన్ మీటింగ్) నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్పందించిన డీఈవో మల్లికార్జున్ అక్రమ డిప్యూటేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని కోరుతూ, వాటిని పరిశీలించి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా విద్యాశాఖ అభివృద్ధి కోసం అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం, ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షురాలు నళిని దేవి, టి. శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు నరేందర్, గోపు శ్రీనివాస్, సోలేటి నారాయణ, విజయశ్రీ, రాజశేఖర్, సునీల్ కుమార్, ఫెడరేషన్ సీనియర్ బాధ్యులు ప్రకాష్, లింగం పేట బాధ్యులు హరీష్, కామారెడ్డి మండల అధ్యక్షులు గ్యార బాబయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, సదాశివనగర్ మండల అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్, ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.