. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించి ప్రాణాలను కాపాడడంతో పాటు, ప్రమాద బాధితులకు సహాయం చేసే పౌరులను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్టిహెచ్) ఆధ్వర్యంలో పీఎం రహత్, పీఎం రహ్ – వీర్ పథకాలను అమలు చేస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఈ రెండు పథకాల ప్రధాన ఉద్దేశ్యం రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అత్యంత కీలకమైన గోల్డెన్ అవర్ సమయంలో బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించి ప్రాణాలను రక్షించడం, అలాగే ప్రజల్లో మానవత్వం, బాధ్యతాయుతమైన స్పందనను పెంపొందించడమేనని ఆయన పేర్కొన్నారు. పీఎం రహత్ పథకం కింద రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన అర్హులైన బాధితులకు రూ.1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ వైద్యం లేదా ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్టంగా ఏడు రోజుల వరకు ఉచిత చికిత్స అందించబడుతుందని వివరించారు. ఈ సేవలు ప్రభుత్వం గుర్తించిన ఎంపానెల్డ్ ఆసుపత్రుల్లో లభిస్తాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం మనోరమ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ పైలట్ ఆసుపత్రులుగా ఎంపికయ్యాయని వెల్లడించారు. అదే విధంగా పీఎం రహ్ – వీర్ పథకం కింద రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన బాధితులకు గోల్డెన్ అవర్‌లో సహాయం చేసి సమీప ఆసుపత్రికి తరలించే వ్యక్తిని “రాహ్-వీర్”గా గుర్తించి కేంద్ర ప్రభుత్వం రూ.25,000 నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివరాలను ఈ దార్ (ఎలక్ట్రానిక్ డిటేయిల్డ్ ఆక్సిడెంట్ రిపోర్ట్) వ్యవస్థ ద్వారా నమోదు చేయడం వల్ల పోలీస్ శాఖ, రవాణా శాఖ, ఆరోగ్య శాఖ, ఆసుపత్రులు, బీమా సంస్థలు, ఇతర సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో వేగంగా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని కమిషనర్ వివరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాద బాధితులను చూసినప్పుడు భయపడకుండా వెంటనే సహాయం చేయాలని, సమయానికి అందించిన సహాయం ఒక ప్రాణాన్ని కాపాడగలదని సూచించారు. ప్రమాదం జరిగిన వెంటనే 112, 100 లేదా 108 నంబర్లకు సమాచారం అందించాలని, ప్రతి ఒక్కరూ “రాహ్-వీర్”గా మారి మానవత్వాన్ని చాటాలని ఆయన పిలుపునిచ్చారు.