- కల్లుడిపోలకు అల్ర్పాజోలం రవాణాపై నజర్
- నార్కోటిక్, పోలీసు, ఎక్సైజ్ శాఖల దూకుడు
- స్మగర్ల కదలికలపైనే కన్ను
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కల్తీకల్లు తయారీకి రాజధాని. ఉమ్మడి జిల్లాలో కల్లుప్రియులకు సరిపడా చెట్లు( ఈత, తాటి) వనాలు లేకపోవడంతో క్రుత్రిమ కల్లు తయారీ కుటీర పరిశ్రమను మించిపోయాయి. ఉమ్మడి జిల్లాలో 100కు పైగా కల్లు డిపోలు (రసాయానాలతో కూడిన నిషేదిత మత్తు పదార్థాలు) కలిపి తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి. లైసెన్స్ డ్ కలిగిన గీత కార్మికులను పోగేసి సొసైటీ ముసుగులో ఉమ్మడి జిల్లాలో మత్తు కల్లు తయారీకి మూడు సీసాలు.. ఆరు ప్యాకెట్లుగా తయారవుతుంది. ఒకప్పుడు కేవలం క్లోరోఫాం, డైజోఫాం కలిపిన కల్లును విక్రయించే వారు. దాని వలన తయారీ కల్లు ప్రజలకు పెద్దగా నష్టమేమి లేకుండే. ప్రస్తుతం డేంజర్ డ్రగ్ గా, అత్యంత ఖరీదైన నిషేధి త మత్తు పదార్థం అల్ర్పాజోలంను కల్తీకల్లు తయారిలో వినియోగిస్తున్నారు. రాష్ట్రం డ్రగ్ రహితంగా మార్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. అయితే కొకైన్, హెరాయిన్, నెఫ్రాడిన్ లాంటి మత్తు పదార్థాల కంటే ఖరీదైనదిగా అల్ర్పాజోలం పేరుంది.
హైదరాబాద్ నగరంలో కొందరు మాత్రమే డ్రగ్స్ కు బానిసలుగా ఉన్నారు. కానీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని దాదాపు లక్షకు పైగా ప్రజలు మత్తు కల్లుకు బానిసలుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. గడిచిన నెలలో బీర్కూర్ మండలంలో మోతాదుకు మించిన మత్తు పదార్థాలు కలిపిన కల్తీకల్లు తాగి 65 మంది ఆసుపత్రి పాలయ్యారు. గాంధారి మండలంలో కల్తీకల్లులో మోతాదు డోస్ తక్కువైందని ప్రజలు అతిగా ప్రవర్తించారు. వారం రోజుల వ్యవధిలో కామారెడ్డి జిల్లాలో జరిగిన రెండు ఘటనలు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలో పోలీసు, ఎక్సైజ్ అధికారులకు మత్తు పదార్థాల స్మగ్లర్లపై నజర్ వేయాలని సంకల్పించారు. వారికి యాంటి నార్కోటిక్ బ్యూరో తోడైంది. గడిచిన నెల రోజులుగా ఉమ్మడి జిల్లాలో కల్లు డిపోలకు నిషేదిత మత్తు పదార్థాలను రవాణా చేస్తున్న సూత్రదారులపై కన్నేశారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పేరు మోసిన స్మగ్లర్లకు పెట్టింది పేరు. ఓ సామాజిక వర్గానికి ఉపాధి పేరిట జరుగుతున్న కల్తీకల్లు తయారి వల్ల లక్షల మంది అమాయకులైన ప్రజలు మత్తు కల్లుకు బానిసలవుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రిలో డీ అడిక్షన్ కేంద్రం ఉంది. అదీచాలదన్నట్లు జిల్లా కేంద్రంలో మానసిక వైద్యులు వంద పడకల ఆసుపత్రులలో ఏర్పాటు చేసి కల్లు మానిపించేందుకే లక్షల రూపాయలు ఫీజులు గుంజే దవఖానాలకు కొదవ లేదు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కల్లుడిపోలకు మత్తు పదార్థాల రవాణాను అడ్డుకునేందుకే ఎక్సైజ్, పోలీసు, నార్కోటిక్ టీంలు పని చేస్తున్నాయి. అందులో భాగంగానే కల్లు తయారిలో ప్రధానమైన నిషేదిత మత్తు పదార్థాల కేసుల్లో గతంలో అరెస్టు అయిన వారు ప్రస్తుతం దందాలో కీలకంగా ఉన్న వారు ఎక్కడ ఏయే డిపోలలో మత్తు పదార్థాలతో తయారవుతుండడం అక్కడ ప్రత్యేకంగా నజర్ వేసి స్మగ్లర్ల వేట కొనసాగిస్తున్నారు.