- చిన్నారులను గాయపరుస్తున్న శునకాలు
- రోడ్ల మీద ప్రయాణించాలంటే భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు
- పూర్తి స్ధాయిలో నియంత్రణ చేపట్టని అధికారులు
రుద్రూర్, బతుకమ్మ : వీధి కుక్కల బెడద అధికమైంది. కుక్కలు గుంపులు, గుంపులుగా స్వైరవిహారం చేస్తూ చిన్నా పెద్ద అని తేడా లేకుండా దాడి చేస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీంతో రోడ్లమీద ప్రయాణించాలంటేనే ప్రజలు భయాబ్రాంతులకు గురవుతున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో కుక్కల బెడద అధికమైంది. ప్రజలు బయటకు వెళ్లాలంటే కుక్కలు ఉండడంతో జంకుతున్నారు. గతంలో గ్రామ పంచాయతీ పరిధిలో కుక్కలను బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం లాంటివి చేసేవారు. ప్రస్తుతం ఆ తరహ చర్యలు కనిపించడం లేదు. కుక్కలను చంపకుండా వాటి సంతతిని పెరగకుండా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సి ఉండగా, వాటిని సైతం ఎక్కడా అమలు చేసిన దాఖాలాలు లేవు. చిన్నారులు తిను బండరాలను కొనుక్కోవడానికి దుకాణాలకు వెళ్లేటప్పుడు కుక్కలు వెంట పడుతున్నాయని, చాలా చోట్ల కుక్కలు చిన్నారులను వెంట పడి గాయపర్చిన సంఘటనలు తెలిసినవే. ఇప్పటికైనా పశుసంవర్ధకశాఖ, గ్రామ పంచాయతీ అధికారులు సమన్వయంతో కుక్కల బెడదపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.