29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కామారెడ్డి వాసుల్లో కదలికేదీ..?

Must read

📰 Generate e-Paper Clip

. తెలంగాణతోసహా మహారాష్ర్టలోనూ మసకబారుతున్న ప్రతిష్ట

. పసిమొగ్గలను గర్భంలోనే తుంచేస్తున్న దుర్మార్గులకు అడ్డాగా జిల్లా కేంద్రం

. విచ్చలవిడిగా లింగనిర్ధారణ పరీక్షలు

. నిందితులకు అండగా ఉంటున్నదెవరు?

కామారెడ్డి, బతుకమ్మ:  లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ పసిమొగ్గలను గర్భంలోనే తుంచేస్తున్న దుర్మార్గులకు కామారెడ్డి జిల్లా కేంద్రం అడ్డగా మారింది. తెలంగాణతోసహా మహారాష్ర్టలోనూ జిల్లా ప్రతిష్ట మసకబారుతోంది. లింగనిర్ధారణ, అబార్షన్లు, శిశువిక్రయాలకు జిల్లా కేంద్రాన్ని అడ్డాగా మార్చిన దుర్మార్గులను ఉపేక్షిస్తున్నది ఎవరు? జిల్లా ప్రతిష్ట దిగజారుతున్నా కామారెడ్డి వాసుల్లో కదలిక ఎందుకు రావడం లేదనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న వారిని కాపాడుతున్న వారెవరు? అనే ప్రశ్న తలెత్తుతోంది.

‘కౌసల్య’తో మొదలు..

జిల్లా కేంద్రంలోని కౌసల్య హాస్పిటల్ లో  లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ డాక్టర్ ఇట్టం సిద్ధిరాములు అడ్డంగా దొరికిపోయాడు. విచారణ అనంతరం అధికారులు హాస్పిటల్  సీజ్ చేశారు.  శిశువులను విక్రయిస్తూ కోట్ల సంపాదనకు జిల్లా కేంద్రాన్ని అడ్డాగా చేసుకున్నారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. తాజాగా సిద్ధిపేట కేంద్రంగా శిశువిక్రయం కేసులో నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆరోపణలు నిజమేనని తేలింది. నిందితులను రిమాండ్ కు పంపారు. అలాగే  ఇట్టం సిద్ధిరాములు కుమారుడైన డాక్టర్ ప్రవీణ్ కుమార్ కు సైతం లింగ నిర్ధారణ పరీక్షల్లో హస్తం ఉన్నట్లు తేలడంతో గాంధారి ప్రాథమిక వైద్యుడిగా పని చేస్తున్న ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దీంతో ఆయన కౌసల్య హాస్పిటల్ లోనే మళ్లీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. తండ్రి సహాయంతో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడనే ఫిర్యాదులు అందాయి. శుక్రవారం రాత్రి సమయంలో రైల్వే గేట్ ప్రాంతంలో ఓ కారులో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా అడ్డంగా దొరికిపోయాడు. వీరికి కామారెడ్డి, పరిగి ప్రాంతాల్లో పెద్ద ఆస్పత్రులు ఉన్నాయి. గత నెల రోజుల క్రితమే శిశువిక్రయ కేసులో అడ్డంగా దొరికిపోయి జైలు పాలైన విట్టం సిద్ధిరాములు తనకున్న పలుకుబడితో డబ్బులు చల్లి బెయిల్  పై విడుదలయ్యారు. కఠిన చర్యలు లేకపోవడంతోనే జిల్లాలో ఇటువంటి కేసులు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి.

పౌర సమాజానికి పట్టింపు లేదా?

జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్ల వ్యవహారంలో పౌరసమాజం నోరు మెదపడం లేదు. సారా ఉద్యమం నుంచి మహిళల సమస్యల వరకు అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఉన్న కామారెడ్డి జిల్లా స్థానిక మహిళా నాయకత్వం కూడా ఈ అక్రమ దందాపై స్పందించడం లేదు. జిల్లా కేంద్రంలో అనేక ప్రజా సం ఘాలు ఉన్నా దుర్మార్గపు చర్యలను ఎండగట్టడంపై దృష్టి సారించడం లేదు. ఉన్నతాధికారులు స్పం దించి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అధికారుల తీరుపై అనుమానాలు..

ఇటీవల మహారాష్ర్టలో ఓ మహిళకు అబార్షన్ చేసిన కేసులో అక్కడి పోలీసులు విచారణ చేపట్టగా, సదరు మహిళ కామారెడ్డిలో స్కానింగ్ చేయించుకోగా, ఆడ పిల్ల అని తెలిసిందని.. అందుకే అబార్షన్ చేయించామని తెలిపారు. అక్కడి పోలీసులు వచ్చి కామారెడ్డికి చెందిన వైద్యుడిని అరెస్టు చేసి తరలించారు. మహారాష్ర్ర్టకు చెందిన అధికారులను సైతం మేనేజ్ చేసిన సదరు వైద్యుడు తిరిగి వచ్చేశాడు. అదే వైద్యుడి వద్ద లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన వ్యవహారాలను చూసుకున్న రాజంపేట మండల కేంద్రానికి చెందిన కొందరు వ్యక్తులు సొంతంగా స్కానింగ్ దందా మొదలుపెట్టారు. ఇంటి వద్దకే మిషన్ ను తీసుకువెళ్లి స్కానింగ్ చేస్తున్న విషయం తెలియడంతో పోలీసులు సదరు వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే రాజంపేట మండల కేంద్రంలో మొబైల్ స్కానింగ్ యంత్రాన్ని సీజ్ చేసిన పోలీసులు.. జిల్లా కేంద్రంలో అడ్డగోలుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నవారిపై గట్టి చర్యలు తీసుకోక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏదైనా చర్య మొదలుపెట్టగానే స్కానింగ్ నిర్వాహకులకు తెలిసిపోతోందంటే ఇంటి దొంగల వల్లేనని స్పష్టమవుతోంది.

More articles

Latest article