27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రైతు డిస్కం లను రైతు ఉద్యమం ద్వారా తిప్పికొడతాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రైతులకు షాక్ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న ఈ రైతు డిస్కం లను రైతు ఉద్యమం ద్వారా తిప్పికొడతామని అందుకు రైతులు సిద్ధమవ్వాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య కోరారు. ఆదివారం నగరంలో కోటగల్లీ లోని శ్రామిక భవన్ లో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము నూతన విద్యుత్ చట్టం తీసుకువచ్చిందని, వ్యవసాయ రంగానికి వివిధ రాష్ట్రాలతో ఉచితంగాను, చౌకగాను, విద్యుత్ ఇస్తుందని దానివల్ల విద్యుత్ సంస్థ నష్టాలు ఎదుర్కొంటుందని సాకు తో మొత్తం విద్యుత్ సంస్థలను ప్రైవేటుకు అప్పజెప్పేందుకు ప్రయత్నిస్తుందని ఆయనన్నారు. రైతుల మోటార్ల వద్ద స్మార్ట్ మీటర్లు బిగించి ఎంత కరెంటు కాలితే అంత కరెంట్ చార్జీని వసూలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆ ప్రయత్నంలో భాగమే స్మార్ట్ మీటర్లు అని తెలిపారు. ఏ రైతు కూడా ఇంత భారాలు మోసి వ్యవసాయం చేయలేడని, ఇప్పటికైనా ప్రభుత్వం రైతు డిస్కం లను ఉప సంహారించుకోవాలని కోరారు. ఇటీవల 14 రకాల పంటలకు నామమాత్రము ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం రైతులు వినియోగించే ఎరువులు, పెస్టిసైడ్, పెట్రోల్, ధరలను విపరీతంగా పెంచేసిందన్నారు. కానీ రైతులు పండించిన పంటలకు వరికి క్వింటాలుకు రూ.72, మొక్కజొన్నకు రూ.10, పెసర్లకు రూ.12 పెంచి కాంప్లెక్స్ బస్తాకు రూ. 300 నుండి రూ.400 పెంచి, రైతు నడ్డి విరిచిందని అన్నారు. ఇంత భారీ పెట్టుబడి పెట్టిన రైతులు తిరిగి ఆ ఖర్చులు కూడా రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, వ్యవసాయం వల్ల సంక్షోభంలోకి నెట్టబడుతున్నారని వారన్నారు. లక్షల రూపాయలు అప్పులు చేసి పంటలు పండిస్తున్నా ప్రభుత్వాలు వారి పంటలు కొనుగోలు చెయ్యడం లొ తీవ్ర జాప్యం చేస్తుందని అన్నారు. ఇంత తీవ్ర ఎండలో రైతులు తమ కుప్పల దగ్గర నిరీక్షిస్తూ అష్ట కష్టాలకు, అనారోగ్యాలకు గురవుతున్నారని నేటికీ కొనుగోలు పూర్తి చేయలేక పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ ప్రాంత రైతులు పండించిన పంటను ధాన్యాన్ని కొనుగోలు చేయవద్దని కొనుగోలు సంస్థలకు జిల్లా అధికారులు చెప్పడం చూస్తే రైతును మరింత మానసిక శోభకు గురి చేయడమే అవుతుందని మండిపడ్డారు. వీటితో పాటు జిల్లాలో గల రెండు చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించాలని ఎన్సీఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడపాలని, మంచిప్ప 21వ ప్యాకేజీ పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని అందుకు తగిన నిధులు కేటాయించాలని, తదితర రైతు కూలీల ప్రజల సమస్యల పరిష్కరించాలని భూమయ్య ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి, ఉపాధ్యక్షులు పార్వన్న, సహాయ కార్యదర్శులు అగ్గు చిన్నయ్య, బన్సీ, గంగప్ప తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article