27.8 C
Hyderabad

రేపు సీఎం ఇలాఖాలో కవిత పాంచజన్య శంఖారావం

Kavitha to sound the battle cry in the CM's stronghold tomorrow.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఘనంగా ఏర్పాట్లు చేసిన పార్టీ నాయకులు

. . . కొడంగల్ నుంచి కోస్గి వరకు భారీ ర్యాలీ

కొడంగల్, బతుకమ్మ :

 

సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పాంచజన్య శంఖారావం పూరించనున్నారు. కొడంగల్ నియోజవకర్గంలోని కోస్గి కాలేజీ గ్రౌండ్ లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే పాంచజన్య సంకల్ప సభకు పార్టీ నాయకులు ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. 120 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో భారీ సభా వేదిక ఏర్పాటు చేశారు. వంద మందికి పైగా ముఖ్య నాయకులు సభ వేదిక మీద కూర్చోనున్నారు. సభా ప్రాంగణంలో 10 వేల మంది ప్రజలు కూర్చొనేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మొదటి సారి కొడంగల్ కు వస్తున్న పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికేలా పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొడంగల్ నుంచి కోస్గి కాలేజీ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కోస్గి పట్టణంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన తర్వాత కవిత నేరుగా కాలేజీ గ్రౌండ్ కు చేరుకుంటారు. హైదరాబాద్ శివారుల్లోని అప్పా జంక్షన్ వద్దకు కల్వకుంట్ల కవితకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నాయకులు ఘన స్వాగతం పలుకుతారు.

. . . కొడంగల్ గడ్డపై శంఖారావం

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కవిత కోస్గి సభ వేదిక పై నుంచి పాంచజన్య శంఖారావం పూరించనున్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత జోగులాంబ తల్లి ఆశీస్సులతో పాలమూరు గడ్డపైనే మొదట అడుగు పెట్టిన కవిత ఇప్పుడు రెండోసారి అత్యంత కీలకమైన సంకల్పం తీసుకోవడానికి పాలమూరు గడ్డనే ఎంచుకున్నారు. మే 8న షాద్ నగర్ సమీపంలోని చౌదరిగూడెం వద్ద పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ నిర్వహించి అప్పటి వరకు మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తట్టి లేపిన కల్వకుంట్ల కవిత  ఆదివారం కోస్గి సభ వేదిక పై నుంచి సబ్బండ వర్గాలు సకల జనుల అభివృద్ధి, సాధికారతతో కూడిన బహుజన తెలంగాణ సాధన కోసం తాను తీసుకోబోయే నిర్ణయాలను ప్రకటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఎలా వంచనకు గురవుతున్నారు.. కృష్ణా జలాల దోపిడీని ఏపీ ప్రభుత్వం ఎంత యథేచ్ఛగా సాగిస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించనున్నారు.

. . .  స్వరాష్ట్రాన్ని పరిరక్షించే స్వీయ రాజకీయ శక్తి

దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పరిరక్షించుకునేందుకు స్వీయ రాజకీయ శక్తి ఎందుకు అవసరమో కవిత వివరించనున్నారు. రెండు జాతీయ పార్టీలు ఢిల్లీకి గులాం గిరి చేస్తూ తెలంగాణ ప్రయోజనాలను ఎలా ఫణంగా పెడుతున్నాయో వివరించనున్నారు. తెలంగాణ సాధన కోసం ఏర్పడిన పార్టీ రాజకీయ పార్టీ సైతం రెండు జాతీయ పార్టీల దారిలోకి వెళ్లడంతో ఫక్తు తెలంగాణ ప్రయోజనాల కోసం గొంతు విప్పే పార్టీ లేకపోవడంతో కవిత తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకగా తెలంగాణ రక్షణ సేన ఏర్పాటు చేశారు. తెలంగాణ మదర్ బోర్డుగా పని చేసే తమ పార్టీని ఆదరించాలని కోస్గి వేదిక మీది నుంచి ప్రజలను అభ్యర్థించనున్నారు. తమకు అవకాశం ఇస్తే బహుజన తెలంగాణాగా మన రాష్ట్రాన్ని ఎలా సుసంపన్నం చేస్తారో వివరించనున్నారు.

More articles

Latest article