. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్, బతుకమ్మ :
సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ (ఎస్ఎస్సీ) అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుండి 12 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని ఆదర్శ మహిళ విద్యాలయం (ఆర్టీసీ బస్టాండ్, నిజామాబాద్), జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ (ఆర్మూర్), గర్ల్స్ హై స్కూల్ & జూనియర్ కాలేజ్ (రాకాసిపేట్, బోధన్) పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షలు జరిగే ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ (పాత సెక్షన్ 144 సీఆర్‌పీసీ) అమలులో ఉంటుందని కమిషనర్ వెల్లడించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపులుగా చేరడాన్ని నిషేధించారు. అలాగే పరీక్షల నిర్వహణకు ఆటంకం కలగకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలను జూన్ 5 నుంచి 12 వరకు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మూసివేయాలని సంబంధిత యజమానులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచనున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
