- కలెక్టర్ కార్యాలయం ముందు టీయూసీఐ ధర్నా
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంటాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు, కనీస పెన్షన్ రూ.9 వేలు అమలు చేయాలని, రెగ్యులరైజ్ చేయాలని, నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై, పని గంటల పెంపుదలకు వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(TUCI) రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ల ముందు ధర్నాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టియుసిఐ జాతీయ ఉపాధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో తక్కువ వేతనాలు అమలవుతుండడం సిగ్గుచేటన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26 వేలు, కనీస పెన్షన్ 9వేలు అమలు చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమానవేతనం ఇవ్వాలన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, పనిగంటల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ లు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టల్స్, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లు, మున్సిపల్, గ్రామపంచాయతీ, మిషన్ భగీరథ, ఆశ, అంగన్వాడి, మధ్యాహ్న భోజన కార్మికులు కనీస వేతనాల కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే కనీస వేతనాలు ₹26 వేలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులను దగా చేయాలని చూస్తే గత కేసిఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు. కార్మికుల ఆవేదన ఆందోళన రూపంగా మారకముందే ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేనిచో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్ జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లేష్ జిల్లా కోశాధికారి సాయరెడ్డి జిల్లా నాయకులు మురళి, కిరణ్, రవి, రాజేశ్వర్, హేమలత, సుమలత, శారద, శివకుమార్, లక్ష్మీ, నవనాథ్, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.
