- రేవంత్ రెడ్డి డమ్మీ సీఎం, మీనాక్షి నటరాజన్ షాడో సీఎం
- బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ది ప్రజల కోసం చేపట్టిన పాదయాత్ర కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం చంపేసిన ఆరు గ్యారెంటీల అంతిమ యాత్ర అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. పచ్చి అబద్ధాలు, గోబెల్స్ మాటలు, అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కాలనాగులా నమ్మి ఓటేసిన ప్రజలనే నిర్దయగా కాటేసిందని ఆయన గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. మీనాక్షి నటరాజన్ వాకింగ్ ఏమాత్రం మనస్సాక్షి లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహకందని షాకింగ్ అని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన కమాండ్ కంట్రోల్ రూమ్ లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చొనే డమ్మీ సీఎం అని, మీనాక్షి నటరాజన్ అదే కేసీఆర్ కట్టించిన సెక్రటేరియట్ లో కూర్చొని రాహుల్ గాంధీ ఎజెండా అమలు చేస్తున్న షాడో సీఎం అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని డిల్లీ కాంగ్రెస్ పెద్దలు కాలరాస్తున్నారని, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు డిల్లీకి బానిసలుగా మారి తెలంగాణ రాష్ట్ర పరువుతీస్తున్నారని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ది ఒడిసిపోయిన కథ అని, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉండి డిల్లీలో మోడీ, గల్లీలో చంద్రబాబు భజన చేస్తున్న రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ నమ్మడం లేదని, అందుకే రేవంత్ ను కలవడానికి కూడా రాహుల్ గాంధీ ఇష్టపడటంలేదని జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పెద్ద కాలాంతకుడని తెలిసే కాంగ్రెస్ పెద్దలు ఆయనను పక్కనబెట్టి మీనాక్షి నటరాజన్ ను రాహుల్ గాంధీ దూతగా రంగంలోకి దించారని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అసలు మీ పాదయాత్ర ఉద్దేశ్యమేంటి మీనాక్షి మేడమ్? అని జీవన్ రెడ్డి నిలదీశారు. కాంగ్రెస్ భావజాలం బొత్తిగా లేని రేవంత్ రెడ్డి సీఎం గద్దెదించడానికా?, లేక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు సరికొత్త మోసాలతో మళ్ళీ ప్రజలను వంచించడానికా? అని ఆయన ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర గత ఎన్నికల్లో ఇచ్చిన 420హామీలకు సమాధి, మరో నయా మోసానికి పునాది అని ఆయన దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికల్లో ఓట్లకోసం ’మీనాక్షి నటరాజన్ ’సరికొత్త నాటకానికి, డిల్లీకి డబ్బుమూటలు పంపే మాయాజాలానికి తెరదీశారని ఆయన ఆరోపించారు. పాదయాత్రలో కాంగ్రెస్ మోసాలపై ప్రజలంతా తిరగబడాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో తూతూ మంత్రపు చర్యలతో నిలువునా ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును వెనుకబడిన వర్గాలు ఏకమై పాదయాత్ర సాక్షిగా మీనాక్షి ఎదుట ఎండగట్టాలన్నారు. రెండు లక్షల వరకు రుణమాఫీ, ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున ఇస్తామన్న రైతు భరోసా ఏదంటూ అన్నదాతలు, కేసీఆర్ పాలనలో రూ. 5 లక్షల చొప్పున వచ్చిన రైతుబీమా ఇప్పుడెందుకు రావడంలేదని మరణించిన రైతు కుటుంబాల వారు నిలదీయాలని ఆయన స్పష్టం చేశారు. పెంచుతామన్న రూ.4000 పెన్షన్లు ఏవంటూ అవ్వా తాతలు ప్రశ్నించాలని, తులం బంగారం ఎప్పుడిస్తా రని కళ్యాణ లక్ష్మి అర్హులంతా అడుగడుగునా నిలదీయాలని ఆయన కోరారు. ఆడబిడ్డలకు రూ.2500 చొప్పున ఇచ్చే మహాలక్ష్మి పథకంపై కాంగ్రెస్ ను కడిగేయాలని, అణచివేతలు, అక్రమ అరెస్టులపై ప్రజలు నిరసన తెలపాలని, యదేచ్ఛగా రాజ్యమేలుతున్న ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాల ఆగడాలను మీనాక్షి ఎదుటే ఎండగట్టాలని కూడా జీవన్ రెడ్డి సూచించారు. తమకిస్తామన్న ఎలక్ట్రిక్ స్కూటీలు ఎప్పుడిస్తారని విద్యార్థినులు, ఏడాదికి రెండులక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నెలకు రూ. 4వేల రూపాయల భృతి ఇస్తామని చేసిన వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుస్తారని నిరుద్యోగులు, ఇందిరమ్మ ఇండ్లు ఇంకెప్పుడు కట్టిస్తారని లబ్ధిదారులు కాంగ్రెస్ నేతలను ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలంతా ఏకమై హింసాత్మక ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికి బుల్డోజర్ పంపి పేదబతుకులను నేలమట్టం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ దుర్నీతిపై, మహానగరం హైదరాబాద్ వైభవాన్ని మసకబారుస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ హైడ్రా ఆకృత్యాలపై మీనాక్షి నటరాజన్ సాక్షిగా డిల్లీ కాంగ్రెస్ పెద్దల చెవులకు చిల్లులు పడేలా గర్జించాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.
