కేంద్ర నిధుల కేటాయింపులో పన్నుల వసూళ్లే పనితీరుకు కొలమానం కాకూడదు

0 13,332

 

. . . ఆదివాసీ, గిరిజన, మారుమూల‌, వెనుకబడిన జీపీల‌కు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలి

 

. . . స్థానిక అవసరాల కోసం అన్‌టైడ్ గ్రాంట్లను కొనసాగించాలి

 

. . . 16వ ఆర్థిక సంఘం జాతీయ వర్క్‌షాప్‌లో తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి

 

. . . గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా.ద‌న‌స‌రి అన‌సూయ సీతక్క

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

16వ ఆర్థిక సంఘం ప్రతిపాదించిన పనితీరు ఆధారిత గ్రాంట్లు, ఓన్ సోర్స్ రెవిన్యూ వంటి నిబంధనల్లో ఆదివాసి, గిరిజన, షెడ్యూల్డ్ ప్రాంతాలు, వెనుకబడిన గ్రామ పంచాయతీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా.ద‌న‌స‌రి అన‌సూయ సీతక్క కోరారు. గ్రామ పంచాయతీల పనితీరును కేవలం పన్నుల వసూళ్లతోనే అంచనా వేయకుండా, ప్రజలకు అందిస్తున్న సేవలు, పారిశుధ్యం, పారదర్శకత, డిజిటల్ పాలన, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల సిఫార్సులపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజ‌న్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వర్క్‌షాప్‌లో మంత్రి సీతక్క తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను వివరించారు. స్పెష‌ల్ సీఎస్ దాన‌కిషోర్ తో పాటు ఇత‌ర రాష్ట్రాల మంత్రులు, అధికారులు ఈ స‌మావేశంలో పాల్గోన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి సీత‌క్క మాట్లాడుతూ…జీపీల‌కు పనితీరు ఆధారిత గ్రాంట్లను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందని, అయితే ఆదాయ సామర్థ్యం తక్కువగా ఉన్న ఆదివాసీ, గిరిజన, మారుమూల ప్రాంతాల గ్రామ పంచాయతీలపై అదనపు పన్నుల భారం మోపే విధంగా నిబంధనలు ఉండకూడదన్నారు. అభివృద్ధిని ప్రజల ఆర్థిక స్థితితో ముడిపెట్టడం సమంజసం కాదని పేర్కొన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో అనేక గ్రామ పంచాయతీల జనాభా చాలా తక్కువగా ఉండటంతో వాటి సొంత ఆదాయ వనరులు కూడా పరిమితంగానే ఉంటాయని తెలిపారు. అలాంటి ప్రాంతాలకు ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని, ఆదివాసీ, గిరిజన, షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామ పంచాయతీలు, మండల స్థాయి స్థానిక సంస్థలకు కూడా పనితీరు గ్రాంట్ల అర్హతలో వెసులుబాటు కల్పించాలని కోరారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల కారణంగా ఎన్నికలు జరగని 62 గ్రామ పంచాయతీలకు  కేంద్ర ప్ర‌భుత్వం అభివృద్ధి నిధులు నిలిపివేయడం వ‌ల్ల అక్క‌డి ప్రజలకు అన్యాయం జ‌రుగుతోంద‌ని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల వల్ల ఎన్నికలు ఆలస్యమైన ప్రత్యేక పరిస్థితుల్లో నిధులు కొనసాగించేలా నిబంధనలు ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి గ్రామ అవసరం భిన్నంగా ఉంటుందని, అందువల్ల స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ సభలు నిర్ణయాలు తీసుకునేలా అన్‌టైడ్ బేసిక్ గ్రాంట్లను తగిన స్థాయిలో కొనసాగించాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. డిజిటల్ గవర్నెన్స్, ఈ-గ్రామ్ స్వరాజ్, పీఎఫ్‌ఎంఎస్ వంటి వ్యవస్థలను తెలంగాణ ప్రభుత్వం స్వాగ‌తిస్తోంద‌ని… వాటి అమలుకు అవసరమైన శిక్షణ, సిబ్బంది, ఇంటర్నెట్ కనెక్టివిటీ, సాంకేతిక మౌలిక వసతులను మారుమూల గ్రామాల్లో కేంద్రం బలోపేతం చేయాలని కోరారు.  షెడ్యూల్డ్ ప్రాంతాలు, వెనుకబడిన జిల్లాలు, భౌగోళికంగా క్లిష్టమైన ప్రాంతాల్లో ప్రజా సేవలను అంద‌చేసేందుకు అధిక వ్యయం అవుతున్నందున నిధుల కేటాయింపులో అలాంటి ప్రాంతాలకు ప్రత్యేక వెయిటేజ్ ఇవ్వాలని కోరారు. బలమైన గ్రామ పంచాయతీలు, బలమైన రాష్ట్రాలు కలిసి బలమైన భారత నిర్మాణానికి పునాది వేస్తాయని మంత్రి సీతక్క అన్నారు.  బలమైన గ్రామ పంచాయతీలు, బలమైన రాష్ట్రాలు కలిసి బలమైన భారత నిర్మాణానికి పునాది వేస్తాయని మంత్రి సీతక్క అన్నారు. గ్రామీణ స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయాలంటే రాష్ట్రాలకు తగిన ఆర్థిక సామర్థ్యం ఉండాలని, సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను బలోపేతం చేస్తూనే పంచాయతీలను మరింత శక్తివంతం చేసే విధంగా 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఉండాలని మంత్రి సీత‌క్క సూచించారు.

 

Tax collections should not be the yardstick for performance in the allocation of central funds.

Leave A Reply

Your email address will not be published.