. . . తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలికల ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ ప్రారంభం
. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
విద్యతో పాటు బాలికలు క్రీడల్లోనూ ప్రతిభ చూపడం అత్యంత అవసరమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సూచించారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గర్ల్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ 2026–27 టోర్నమెంట్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, సమయపాలన, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తి, మానసిక దృఢత్వాన్ని అభివృద్ధి చేస్తాయని తెలిపారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను ప్రదర్శించి జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారిణులను ఆయన ప్రోత్సహించారు. ప్రతి పోటీలో గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తితో ఆడాలని, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని, విద్యాసంస్థలు కూడా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న క్రీడా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలిపి, గాయాలు కాకుండా జాగ్రత్తగా ఆడాలని సూచించారు. ఈ టోర్నమెంట్‌లో నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, వరంగల్ తదితర జిల్లాల నుండి క్రీడాకారిణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి, ఎన్‌డీఎఫ్‌ఏ అధ్యక్షుడు అడ్వైజర్ సుధాకర్, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి జావీద్, ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్‌లు, వివిధ జిల్లాల క్రీడాకారిణులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

