వెబ్ న్యూస్, బతుకమ్మ : లండన్ (London) నగరంలో సౌత్ ఎండ్ ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఒక బీచ్ క్రాఫ్ట్ బీ200 సూపర్ కింగ్ ఎయిర్ మినీ జెట్ విమానం కుప్పకూలిపోయింది. విమానం లండన్ నుంచి నెదర్లాండ్ కు బయలుదేరగా, ఎయిర్‌పోర్టుకు కొద్దిగా దూరంలోనే కూలిపోయింది. ఈవిమానం కూలిన తీరును చూపిస్తూ ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేలపై విమానం పడిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పొగ కమ్ముకుంది. ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు మంటల్లో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన విమానం మెడికల్ ట్రాన్స్‌పోర్ట్ జెట్ (medical transport jet) అని తెలుస్తోంది. ఇందులో సాధారణంగా పేషెంట్లు, వైద్య సిబ్బంది ప్రయాణిస్తారు. కాగా, ప్రమాద సమయంలో ఎంత మంది ఉన్నారన్న విషయంపై తెలియాల్సి ఉంది. ఎయిర్‌పోర్టులో పలు విమానాల రాకపోకలు రద్దు అయ్యాయి. స్థానిక అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. టెక్నికల్ లోపమా? మానవ తప్పిదమా? అనేదానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

