. . . హంగర్గ, జిల్లా జనరల్ ఆసుపత్రి, రఘునాథ చెరువు ప్రాంతంలో మాక్ డ్రిల్
. . . నిశితంగా పర్యవేక్షించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్ సిటీ/ బోధన్, బతుకమ్మ :
వరదలు, విపత్తులు సంభవించే సమయాల్లో చేపట్టాల్సిన తక్షణ చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల విషయంలో సన్నద్ధతకు వీలుగా సోమవారం నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన మాక్ ఎక్సర్ సైజ్ విజయవంతంగా కొనసాగింది. జిల్లా పాలనాధికారి టి.వినయ్ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో హంగర్గ, జిల్లా జనరల్ ఆసుపత్రి, రఘునాథ చెరువు ప్రాంతాలలో మాక్ డ్రిల్ మూడు చోట్ల ఏకకాలంలో నిర్వహించింది.
విపత్తుల సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేలా మాక్ ఎక్సర్ సైజ్ ద్వారా చేపట్టిన సహాయక చర్యలు వాస్తవికతను మరిపించేలా చేశాయి. అన్ని శాఖల పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ, విపత్తుల సమయంలో ఏ విధంగా వ్యవహరించాలన్నది కళ్ళకు కట్టినట్టు ఆచరణాత్మక రూపంలో చేసి చూపించారు. డ్రోన్ లు, వాటర్ బోట్ లు, అంబులెన్స్ లు, అగ్నిమాపక శకటాలు, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చేపట్టిన సహాయక చర్యలు విపత్తుల నిర్వహణపై సన్నద్ధతను చాటి చెబుతూ ప్రజల నమ్మకాన్ని పెంపొందింపజేస్తాయి. ఆయా శాఖల అధికారులతో పాటు ఎస్.డీ.ఆర్.ఎఫ్, ఎన్.సీ.సీ, ఆపద మిత్ర వాలంటీర్లు మాక్ డ్రిల్ విజయవంతానికి దోహదపడ్డారు.

హంగర్గ వద్ద జరిగిన కార్యక్రమాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. వరద జలాలు గ్రామాన్ని ముంచెత్తే ప్రమాదం తలెత్తిన సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, చేపట్టాల్సిన తక్షణ చర్యలు వాస్తవిక రూపంలో మాక్ ఎక్సర్ సైజ్ ద్వారా చేసి చూపించారు. ముంపు ప్రభావానికి గురి అయిన వారిని బోట్లు, అంబులెన్స్ లు, ఇతర వాహనాల్లో కోప్పర్గా గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరానికి తరలించి సహాయక చర్యలు చేపట్టిన దృశ్యాలు వాస్తవికతకు అద్దం పట్టాయి. వైద్య శిబిరాలను నెలకొల్పి ఆరోగ్య సేవలు అందించడం తదితర సహాయక చర్యలను కలెక్టర్ తో పాటు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలతో పాటు మూగజీవాల ప్రాణాలను కాపాడే చర్యలను పర్యవేక్షిస్తూ, రిలీఫ్ క్యాంప్ ను సందర్శించి బాధితులకు అందిస్తున్న తోడ్పాటు, వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని రఘునాథ చెరువు వద్ద వరద జలాల లో చిక్కుకుపోయిన వారిని, నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారిని కాపాడి, వారికి తక్షణ వైద్య సేవలు, సహాయక చర్యలు చేపట్టే కార్యక్రమాలు విపత్తుల సందర్భంగా నెలకొనే హడావుడిని తలపించాయి.

చెరువు నీటిలో చిక్కుకున్న వారిని డ్రోన్ల సహాయంతో గుర్తిస్తూ, బోట్ల ద్వారా ఎస్.డీ.ఆర్.ఎఫ్ సిబ్బంది వారిని కాపాడడం, ఒడ్డుకు చేర్చిన వెంటనే వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స జరిపి అంబులెన్స్ లలో ఆసుపత్రికి తరలించడం వంటి సహాయక చర్యలు అధికార యంత్రాంగం సన్నద్ధతను నిరూపించాయి. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్, మత్స్య శాఖ సహాయ సంచాలకులు ఆంజనేయస్వామి ఇతర అధికారులు సహాయక చర్యలు పర్యవేక్షించారు. కాగా, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని వరద జలాలు చుట్టుముట్టిన సమయంలో గ్రౌండ్ ఫ్లోర్ లోని పేషెంట్లను హుటాహుటిన పై అంతస్తులో చేర్చి, వారి ప్రాణాలను ఎలా కాపాడాలి అనే దానిపై మాక్ ఎక్సర్ సైజ్ ద్వారా ఆచరణాత్మక రీతిలో చేసి చూపించారు. నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్ పర్యవేక్షణలో మాక్ డ్రిల్ జరిగింది. పోలీస్, ఫైర్, రెవెన్యూ, ఫిషరీస్, హెల్త్, ట్రాన్స్పోర్ట్ మాక్ ఎక్సర్ సైజ్ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

