నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని, అదే యాదగిరన్నకు నిజమైన నివాళి అవుతుందని సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ర్ట కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. ఆదర్శ కమ్యూనిస్టు, సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ యాదగిరి ప్రథమ వర్ధంతి సభను పార్టీ అర్బన్, రూరల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్, వెంకటేశ్వర కళ్యాణ మండలంలో నిర్వహించారు. ముందుగా పార్టీ శ్రేణులు కామ్రేడ్ యాదగిరన్న, అనసూయక్క చిత్రపటాలకు పూలమాలలు వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. ఈ సంతాప సభకు సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నిజామాబాద్ అర్బన్, రూరల్ జిల్లా కార్యదర్శులు వనమాల కృష్ణ, వి. ప్రభాకర్ లు అధ్యక్షత వహించారు. సభలో ‘విప్లవ కార్యశూరుడు కర్నాటి యాదగిరి‘ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ కామ్రేడ్ యాదగిరన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విప్లవ కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో చురుకైన పాత్ర వహించాడన్నారు. ఉద్యమమే వృత్తిగా, ప్రవృత్తిగా ఆదర్శ కమ్యూనిస్టుగా బ్రతికిన కామ్రేడ్ కర్నాటి యాదగిరన్నకు సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తున్నదన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రశ్నించే వ్యక్తులను, శక్తులను, ప్రతిపక్షాలను నిర్బంధానికి గురిచేస్తుందన్నారు. తన విధానాలను నిరసించిన వారిపై సీబీఐ, ఈడీలను ఆయుధాలుగా మార్చుకున్నదన్నారు. చివరకు ఎన్నికల కమీషన్, న్యాయ వ్యవస్థలను సైతం జేబు సంస్థలుగా మార్చుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రామచందర్, కే.రమలు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాన్ని తృణప్రాయంగా త్యజించి, జీవితాంతం విప్లవోద్యమమే జీవితంగా, ఆదర్శవంతంగా బ్రతికిన కామ్రేడ్ యాదగిరన్న కమ్యూనిస్టు శ్రేణులకు ఆదర్శమన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, దాదాపు 33 ఏళ్లు ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా పనిచేశారన్నారు. అలుపెరుగని, చెక్కుచెదరని దృడవిశ్వాసంతో ప్రజాపంథా రాజకీయ అవగాహన వెనుక నిలబడ్డ కామ్రేడ్ యాదగిరన్న అంకితభావ జీవితం ఎంతో ఆదర్శవంతమైందన్నారు. కామ్రేడ్ యాదగిరన్న త్యాగపూరిత ధైర్య సాహసాల జీవితాన్ని గుర్తు చేసుకొని, ఆ త్యాగాల తరపు వారసత్వాన్ని నిలుపుటకు కృషి చేయడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. అరుణోదయ కళాకారులు తమ పాటలతో నివాళి అర్పించారు. సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.నరేందర్, పి.రామకృష్ణ, జిల్లా నాయకులు ఏం వెంకన్న ఎం.ముత్తెన్న, యాదగిరి కుటుంబ సభ్యులు ఏ.రవీందర్ సుధారాణి, సంధ్యారాణి లు మాట్లాడారు. ఈ సంతాప సభలో పార్టీ జిల్లా నాయకులు కే.గంగాధర్, ఎం.సుధాకర్, బి.మల్లేష్, ఎస్.సురేష్, జి.గంగాధర్, డి.కిషన్, సత్తెక్క, ఆర్.రమేష్, కిషన్, రాజేశ్వర్, ప్రజా సంఘాల నాయకులు వి.సంఘం, బి.ఎన్.బి, సిర్ప లింగం, వి.గోదావరి, భాస్కర స్వామి, నరేందర్ గణేష్, అనిల్, నవీన్, వివిధ పార్టీల ప్రజాసంఘాల నాయకులు, కార్మికులు, రైతులు, రైతుకూలీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
