కామారెడ్డి మున్సిపల్‌లో అవినీతి ఆరోపణలు

0 9,990

 

. . . విజిలెన్స్‌ కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ కౌన్సిలర్ల వెల్లడి

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి మున్సిపల్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ పాలకవర్గంపై పలు ఆరోపణలు చేశారు. కామారెడ్డి మున్సిపల్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి పదవుల పంపకాలపై అవగాహనకు వచ్చాయని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ పంపకాలలో భాగంగానే ఒక పార్టీకి చైర్మన్ పదవి, మరో పార్టీకి వైస్ చైర్మన్ పదవి, అలాగే కో-ఆప్షన్ పదవులను కూడా పంచుకున్నారని అన్నారు. పదవుల పంపకాల విషయంలో వచ్చిన విభేదాల కారణంగానే ఇటీవల మున్సిపల్ సమావేశాన్ని వాయిదా వేశారని, బీజేపీ అడ్డుకోవడం వల్ల కాదని స్పష్టం చేశారు. “అభివృద్ధి పనులకు బీజేపీ ఎప్పుడూ అడ్డంకి కాదు. కానీ అక్రమ బిల్లులు, అవినీతికి మాత్రం అడ్డుగా నిలుస్తుంది” అని కౌన్సిలర్లు పేర్కొన్నారు. గత ఎజెండాలో అవినీతికి అవకాశం ఉన్న అనేక అంశాలు ఉన్నాయని, అప్పట్లో ఆమోదం పొందని బిల్లులను మళ్లీ ఎజెండాలో చేర్చి ఆమోదించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డి మున్సిపల్‌లో చైర్మన్ వ్యవహార శైలిపై కూడా బీజేపీ కౌన్సిలర్లు విమర్శలు చేశారు. “ఇక్కడ చైర్మన్ సార్ లేరు, చైర్మన్ మేడం మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ కొందరు చైర్మన్ సార్‌కు ఫోన్ చేస్తున్నారని చెప్పడం సరికాదు” అని వ్యాఖ్యానించారు. ఎవరైనా అధికారులు లేదా ప్రజాప్రతినిధుల పేరుతో డబ్బులు అడిగితే ప్రజలు భయపడకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వస్తే న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. తాయ్ బజార్ వసూళ్లపై కూడా వారు ఆరోపణలు చేశారు. గడువు ముగిసినప్పటికీ ఇష్టానుసారంగా వసూళ్లు కొనసాగిస్తున్నారని, వెంటనే వాటిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ సిబ్బందికి అందించే పనిముట్ల కొనుగోలులో సుమారు రూ.8 లక్షల అవకతవకలు జరిగాయని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు. టెండర్లు పిలవకుండా కొనుగోళ్లు చేశారని పేర్కొన్నారు. అలాగే మున్సిపల్ పరిధిలో మోటార్లు, చెత్త బండ్లు, చెత్త ట్రాక్టర్లు మరమ్మతులకు గురైనా పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. అభివృద్ధి పనుల కంటే బిల్లులు చెల్లించడం, వసూళ్లపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ అధికారులు చెల్లించిన బిల్లుల్లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ కౌన్సిలర్లు తెలిపారు. అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.