. . . ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో యోగా, మెడిటేషన్ పై అవగాహన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
యోగా, మెడిటేషన్ చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం తో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని జిల్లా ఆయుష్ విభాగాధికారి డా.గంగా దాస్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం యోగా డే, హోమియోపతి డే ఆరోగ్య దినోత్సవాల ను పురస్కరించుకొని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఏడవ అంతస్తు లో, పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగా, మెడిటేషన్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన చుట్టూ అనేక రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని, వాటిని మన అవసరానికి అనుగుణంగా, ఆయుర్వేద వైద్య నిపుణుల ద్వారా సూచనలు తీసుకుంటూ ఔషధాలుగా ఉపయోగించవచ్చన్నారు. హోమియోపతి మందులు జిల్లా ప్రజలకు అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి సందేహం లేకుండా డాక్టర్ల సూచనల మేరకు వాటిని ఉపయోగించవచ్చన్నారు.

మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జలగం తిరుపతిరావు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా ప్రశాంతమైన మనసుతో ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా జీవనం కొనసాగించవచ్చన్నారు. యోగ డాక్టర్ తిరుపతి, విజయభాస్కర్ తో కలిసి నర్సింగ్ కళాశాల విద్యార్థినిల చేత యోగ ఆసనాలపై, మెడిటేషన్ పై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో పీడియాట్రిషన్ డా.శ్రీకాంత్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుండి డిహెచ్ఈ ఘన్ పూర్ వెంకటేశ్వర్లు, నర్సింగ్ సూపరిండెంట్ చంద్రకళ, విజయలక్ష్మి, మాక్లూర్ నర్సింగ్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థినిలు, పురుషోత్తం, రమేష్, ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు.

