27.1 C
Hyderabad

మర్డర్ కేసులో నిందితుడి అరెస్టు

Accused arrested in murder case

Must read

📰 Generate e-Paper Clip

. . .  కారు స్వాధీనం

. . . విలేకరుల సమావేశంలో పోలీసు కమిషనర్ సాయిచైతన్య

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నగరంలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గత రెండు రోజుల క్రితం నగరంలోని ఆర్.ఆర్. చౌరస్తా సమీపంలోని గిరిరాజ్ కాంప్లెక్స్ ఎదుట ఉన్న పానీపూరి బండి వద్ద హరిబాబును హత్య చేసిన నిందితుడు సంతోష్ ను అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. శనివారం పోలీస్ కమీషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ యూట్యూబర్ వైష్ణవి హత్య జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకుని తన సోదరుడు సంతోష్ ప్రతీకార భావంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం తన తల్లి గంధం రాణి, పెద్దమ్మ కుమారులు చరణ్, రంజిత్, ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో ఈ నెల 17న సాయంత్రం సుమారు 5 గంటలకు కోరుట్ల నుండి తెలుపు రంగు స్విఫ్ట్ డిజైర్ కారు నంబర్ టీఎస్-36ఏ-4843లో నిజామాబాద్ కు వచ్చినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఆర్.ఆర్. చౌరస్తా సమీపంలోని గిరిరాజ్ కాంప్లెక్స్ ఎదుట ఉన్న పానీపూరి బండి వద్ద మృతుడు హరిబాబును వైష్ణవి సోదరుడు గంధం సంతోష్ కారులో నుండి దిగి, కత్తితో మృతుడి తల, ముఖం, మెడపై పలుమార్లు దాడి చేసి, అనంతరం అదే కారులో అక్కడి నుండి పారిపోయినట్లు తెలిపారు. హరిబాబు తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు నగరంలోని 2వ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సీపీ ఆధ్వర్యం లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి ని ఐడెంటిఫై చేసి టెక్నికల్ ఎవిడెన్స్ , సీ సీ ఫుటేజ్ సహాయం తో దర్యాప్తు ముమ్మరం చేశారు. శనివారం నమ్మకమైన సమాచారం మేరకు నిజామాబాద్ ఔటర్ బైపాస్ ప్రాంతంలో గంధం సంతోష్ ఉన్నట్లు గుర్తించామని సీపీ తెలిపారు. సంతోష్ అత్తగారి ఊరు విశాఖపట్నం వెళ్ళటానికి నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్ళే ప్రయత్నాల్లో ఉండగా పట్టుబడినట్లు సీపీ వెల్లడించారు. విచారణలో లభించిన సమాచారం ఆధారంగా హత్యకు ఉపయోగించిన కత్తి, తెలుపు రంగు స్విఫ్ట్ డిజైర్ కారు , అలాగే కారులో ఉన్న మరో రెండు కత్తులు, రెండు కర్రలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ యేడాది మార్చి 17న హరిబాబు భార్య గంధం వైష్ణవి హత్యకు గురైన కేసులో కోరుట్ల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో హరిబాబు, అతని తల్లి చిత్తారి లక్ష్మి, అతని ఇద్దరు సోదరులు అరెస్టు అయి కరీంనగర్ జైలుకు వెళ్లి అనంతరం బెయిల్ పై విడుదలయ్యారన్నారు. విడుదలైన తర్వాత వైష్ణవి కుటుంబ సభ్యుల నుండి ప్రాణభయం ఉందని భావించి హరిబాబు, అతని తల్లి లక్ష్మి నిజామాబాద్ కు వచ్చి సాయినగర్ లో నివసిస్తూ, ఆర్.ఆర్. చౌరస్తా సమీపంలో మొక్కజొన్న కంకులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నట్లు దర్యాప్తులో తెలిసిందని సీపీ తెలిపారు. నిందితుడు సంతోష్ ను కోర్టులో హాజరుపరచి రిమాండ్ కు తరలించడం జరుగుతోందన్నారు. ఈ కేసులో ప్రాథమికంగా నలుగురు వ్యక్తుల ప్రమేయం నిర్ధారణ కావడంతో, మిగిలిన వారి పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తులో ఎవరి ప్రమేయం తేలినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అరెస్టు చేయడం జరుగుతుందన్నారు. పరారీలో ఉన్న మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. హత్య జరిగిన ఒకటిన్నర రోజులోనే నేరస్తుడిని అరెస్ట్ చేయడంతో ఏసీపీ ప్రకాష్, సిఐ శ్రీనివాస్ రాజ్, ఎస్సై యాదగిరి గౌడ్, సిబ్బందిని సీపీ అభినందించారు.

More articles

Latest article