. . . ప్రభుత్వ నిర్ణయంతో సర్వత్రా ఉత్కంఠ
. . . నిజామాబాద్ కు రింగ్ రోడ్డు ఏర్పాటు హామీలకే పరిమితమైంది
. . . దశాబ్ధాలుగా రింగ్ రోడ్డు కోసం నగర వాసుల ఎదురుచూపులు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ చుట్టురా రింగ్ రోడ్డు ఏర్పాటు కల మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి పాలకులు, ప్రజాప్రతినిధుల కంటే ప్రభుత్వమే చొరవ తీసుకుని పాత జిల్లాల కేంద్రంగా రింగ్ రోడ్డు ఏర్పాటుకు ఇటీవల సమీక్షించడంతో మరోసారి నిజామాబాద్ ప్రజల కల అంశం చర్చకు దారితీసింది. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పట్టణంగా ఉన్న ఇందూర్ కు రింగ్ రోడ్డు ఏర్పాటు హామీ దశాబ్ధాలుగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నాయకులు కేవలం ఎన్నికల్లో గెలుపు కోసమే ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం, ఎన్నికల తర్వాత మరిచిపోవడం సర్వసాధారణమైంది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారినప్పుడే రింగ్ రోడ్డు అంశం తెరపైకి వచ్చినా మాస్టర్ ప్లాన్ లేదనే సాకుతో దాన్ని అమలు కోసం చేసిన సర్వేను అసెంబ్లీ వద్ద తాకట్టు పెట్టిన నాయకులు దానికి అనుమతి తెచ్చే విషయంలో చొరవ తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది.

నిజాం జమానాలోనే నిజామాబాద్ మున్సిపాలిటీగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని సంవత్సరాలకు సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా మారింది. 1973లో తొలిసారిగా నిజామాబాద్ లో మాస్టర్ ప్లాన్ గీశారు. దాని తర్వాత పట్టణం నుంచి నగరంగా విస్తరించిన నిజామాబాద్ డెవలప్ మెంట్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. నిజామాబాద్ చుట్టురా రింగ్ రోడ్డు కోసమని వంద ఫీట్ల రోడ్డును ప్రతిపాదించారు. అది కేవలం వినాయక్ నగర్ నుంచి పూలాంగ్ వాగు వరకు మాత్రమే విస్తరించి రోడ్డుకు ప్రతిపాదనలు చేశారు. కొంత మంది రియాల్టర్లు ప్రజలకు రింగ్ రోడ్డు విషయాన్ని దాచి ప్లాట్లను అమ్మేశారు. ప్లాట్లు కొనుగోలు చేసిన చాలా మంది వినాయక్ నగర్, గాయత్రినగర్ నుంచి మొదలుకుని వర్నిరోడ్డు సాయినగర్ వరకు ఇళ్ళను నిర్మించుకున్నారు. వాళ్ళను రెచ్చగొట్టి రింగ్ రోడ్డు ప్రతిపాదనకు ఆనాడు గండికొట్టారు. దానితో ఆ ప్రతిపాదన అక్కడికే పరిమితమైంది. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో నిజామాబాద్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారింది. ఆనాడు మాస్టర్ ప్లాన్ కోసం ప్రయత్నం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. కానీ మాదవనగర్ నుంచి అర్సపల్లి వరకు నాలుగులైన్ల (వరుసల రహదారి)తో బైపాస్ రోడ్డును ప్రతిపాదించారు. భూసేకరణ జరిగింది మాదవనగర్ నుంచి కంఠేశ్వర్ బైపాస్ మీదుగా అర్సపల్లి వరకు రోడ్డును నిర్మించారు. అదికూడా రెండు వరుసలకే పరిమితమైంది. మాదవనగర్, అర్సపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జిల పనులు ఆనాటి నుంచి ఈనాటి వరకు నత్తనడకన నడుస్తునే ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిజామాబాద్ అభివృద్ది కోసం నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (నుడా) ఏర్పాటు చేసినా నగర అబివృద్ది ఒక్క ఇంచు కూడా పెరుగలేదు. ఇప్పటికీ రెండు పాలకవర్గాలు పదవి కాలం ముగిసినా నిజామాబాద్ నగరం డెవలప్ మెంట్ సున్నా.

నిజామాబాద్ జిల్లా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ తర్వాత అతిపెద్ద నగరంగా ఉంది. ఆ రెండు కార్పొరేషన్లు డెవలప్ మెంట్ లో దూసుకపోతుండగా నిజామాబాద్ మాత్రం మూలకుపడింది. మాస్టర్ ప్లాన్ ను ఆమోదించి దానిని పక్కాగా అమలు చేసే నాయకుడే కరువయ్యారు. అదే సమయంలో నిజామాబాద్ నగర జనాభా 5 లక్షలు దాటింది. మినీ ఇండియాగా పేరు గాంచిన నిజామాబాద్ నగరానికే ఉత్తర, దక్షిణ రాష్ట్రాల నుంచి ప్రజలు ఉపాధి కోసం రావడం, రైళ్ళు, రోడ్డు మార్గలు ఉండడంతో ఇక్కడ నగరానికి జనాభా తాకిడి నిత్యం 2 లక్షల వరకు ఉంటుందంటే అతిశయోక్తి కాదు. నిజామాబాద్ నగరం మీదుగా ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ 46కు పైగా రైళ్ళు పరుగెడుతున్నాయి. అంతేగాకుండా నిజామాబాద్ నగరంలో దక్షిణాదిలో పసుపు మార్కెట్ కు ప్రసిద్ది. ఇక్కడ పసుపు ఎగుమతులు ఏకంగా దేశ, విదేశాలకు జరుగుతున్నాయి. అంతేగాకుండా తెలంగాణలో అతిపెద్ద బాయిల్డ్ రైస్ పరిశ్రమ నిజామాబాద్ నగరానికి ఆనుకునే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగర శివారులో రైల్వే గూడ్ షెడ్డుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగాలంటే ప్రధానమైన రోడ్డు వ్యవస్థ దారుణంగా ఉంది. నిజామాబాద్ రోడ్లు హైదరాబాద్ పాతబస్తీ రోడ్డులను తలపిస్తాయి. ఇందూర్ పట్టణంలో షాపింగ్ కోసం కారు తీసుకువస్తే పార్కింగ్ కు స్థలం లేని దుస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ తో పాటు రింగ్ రోడ్డు అత్యవసరమైంది. ఇప్పటి వరకు ఉన్న మాస్టర్ ప్లాన్ ను పక్కన పెట్టి కొత్తగా జక్రాన్ పల్లిలో ఏర్పాటు కానున్న ఎయిర్ పోర్టుకు అనుసంధానిస్తూ రింగ్ రోడ్డును నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉంది. 44 జాతీయ రహాదారితో పాటు 63 జాతీయ రహదారిని కలుపుతూ రింగ్ రోడ్డును నగర నాలుగు దిక్కులా నిర్మిస్తే ట్రాఫిక్ ఇబ్బందికి చెక్ పెట్టవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని రింగ్ రోడ్డు నిర్మిస్తామని చేసిన ప్రతిపాదనను స్థానిక ప్రజాప్రతినిధులకు పార్టీలకతీతంగా ముందుండి చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.