. . . కేంద్రంలో బీజేపీ ఇచ్చిన హామీలను ముందు నెరవేర్చాలి
. . . జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
బిజెపి నాయకులు ముందు వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాత మాట్లాడాలీ తప్ప వారు తప్పుచేసి ఎదుటి వారిపై నిందలు వేయకూడదని, బిజెపి చేయనున్న ముట్టడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు ఈనెల 21 వ తేదీన కలెక్టరేట్ ముట్టడి చేస్తామని అంటున్నారని, బిజెపి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ముట్టడి చేస్తారా లేక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నందుకు ముట్టడి చేస్తున్నారా అని నగేష్ రెడ్డి అన్నారు. స్థానిక ఎంపీ కేంద్రం నుండి నిజామాబాద్ జిల్లాకు ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేదని, జిల్లా అభివృద్ధి గురించి ఎంపీ ఆలోచించిందే లేదని, మాధవ నగర్ బ్రిడ్జి గత ఏడు సంవత్సరాలుగా నత్తనడకన నడుస్తున్న స్థానిక ఎంపీ పట్టించుకున్న పాపాన లేడని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని నగేష్ రెడ్డి అన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను అందించడం జరుగుతుందని, ఇల్లు నిర్మించుకునే వారికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని, గత పది సంవత్సరాలలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి 24 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశారని తెలిపారు. అదే విధంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ప్రభుత్వమే అందిస్తుందని, ఎందుకంటే గతంలో దొడ్డు బియ్యం ఇవ్వడం ద్వారా ప్రజలు వాటిని తినలేక దళారులకు అమ్ముకొని నష్టపోవడం జరిగిందని ఆయనన్నారు. అదే విధంగా రైతు సోదరుల కొరకు రైతు రుణమాఫీ చేయడం జరిగిందని, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం, రైతు భరోసా ద్వారా ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయల పెట్టుబడి సాయం అందించడం జరుగుతుంది అని, పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని, ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుండి 10 లక్షల వరకు పెంచడం జరిగిందని, మహిళా సోదరీమణుల కొరకు ఉచిత బస్సు సౌకర్యం అందించడం జరిగిందని, 80,000 ఉద్యోగాలు రాష్ట్రంలో కల్పించడం జరిగిందని నగేష్ రెడ్డి అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ హయాంలో క్రూడ్ ఆయిల్ ధర 140 ఉన్న సందర్భంలో పెట్రోల్ 70 రూపాయలు, డీజిల్ 60 రూపాయలకు అందించడం జరిగిందని, కానీ బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రూడాయిల్ ధర తగ్గినప్పటికీ పెట్రోల్ ధరను 110 రూపాయలకు, డీజిల్ ధరను 97 రూపాయలకు పెంచడం జరిగిందని, వంట గ్యాస్ సిలిండర్ ధరను కూడా 400 నుండి 1000 రూపాయలకు పైగా చేయడం జరిగిందని బిజెపి ప్రభుత్వం ఎన్ని వైఫల్యాలకు కారణమైన కూడా బిజెపి నాయకులు సిగ్గు లేకుండా 21వ తేదీన ముట్టడి చేస్తామని చెప్పడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని నగేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలికేట్ శేఖర్ గౌడ్, సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం, కార్పొరేటర్ ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
