24.7 C
Hyderabad
Monday, August 3, 2026

కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాల సాధనకు ఉద్యమించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సీపీఐ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కామ్రేడ్ రాయల చంద్రశేఖర్‌ ఆశయాల సాధన దిశగా ఉద్యమాలను మరింత బలోపేతం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని సీపీఎం మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జాతీయ నాయకులు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ రెండో వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కోటగల్లి ఎన్.ఆర్.భవన్‌లో గురువారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్మారక సభలో ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ మరణం పార్టీకి, విప్లవోద్యమానికి మాత్రమే కాకుండా పీడిత వర్గాలకు కూడా తీరని లోటని పేర్కొన్నారు. చంద్రశేఖర్‌తో పాటు ఆయన సోదరులు నలుగురూ విప్లవోద్యమానికి తమ జీవితాలను అంకితం చేశారని కొనియాడారు. చంద్రశేఖర్ అనేక సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడుపుతూ ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, సంయుక్త కిసాన్ మోర్చా సభ్యుడిగా రైతాంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని, దేశవ్యాప్తంగా జరిగిన రైతు ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా పాల్గొన్నారని గుర్తుచేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విప్లవోద్యమ నిర్మాణానికి విశేష కృషి చేసిన చంద్రశేఖర్, పీడిత ప్రజల విముక్తి, సమ సమాజ నిర్మాణం కోసం జీవితాంతం పోరాడారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఎం. నరేందర్, డివిజన్ కార్యదర్శి ఎం. వెంకన్న, నగర కార్యదర్శి ఎం. సుధాకర్, పీ.ఓ.డబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, పీ.డీ.ఎస్.యూ జిల్లా అధ్యక్షుడు కే. గణేష్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిబాబా, టీయూసీఐ జిల్లా నాయకులు లింగం, నర్సక్క, గంగాధర్, పీ.డీ.ఎస్.యూ నగర అధ్యక్షుడు నసీర్, కార్యదర్శి వినోద్, ఉపాధ్యక్షులు సృజన్, మనితేజ, శ్రీశాంత్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article