. . . ఇది అభివృద్ధి బడ్జెట్, సకల జనుల బడ్జెట్
. . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి గల నాయకత్వంలో భారతదేశం సుస్థిరమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని, ఈ కేంద్ర బడ్జెట్ 2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను అందించిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. సుస్థిరమైన పాలన, దీర్ఘకాలిక నిర్ణయాల వల్ల భారత జీడీపీ 7 శాతానికి పెరిగిందని, గత ఏడాది 50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా, ఈసారి అభివృద్ధి లక్ష్యంగా 53 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ఆయన పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా బడ్జెట్ రూపొందించబడిందని, ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో యువతను దేశ ప్రగతిలో భాగస్వాములను చేస్తున్నారని, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించారన్నారు. పేదలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో క్యాన్సర్ మందులతో సహా 17 రకాల ప్రాణాధార ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారని, ప్రతి జిల్లా కేంద్రంలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు నిర్ణయం పేద రోగులకు గొప్ప ఊరటని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారానికి ఈ బడ్జెట్ గట్టి సమాధానం చెప్పిందని, గతంలో రూ. 81 వేల కోట్లు కేటాయిస్తే, ఈసారి ఏకంగా రూ.1.50 లక్షల కోట్లకు పైగా కేటాయించి గ్రామీణ పేదలకు అండగా నిలిచారన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ‘షీ మార్ట్’లు, ప్రతి జిల్లాలో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల ఏర్పాటు, స్కూళ్లలో క్రియేటర్స్ ల్యాబ్స్ వంటి నిర్ణయాలు మహిళాభ్యున్నతికి దోహదపడతాయని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా హైదరాబాద్ మీదుగా పూణే, చెన్నై, బెంగళూరు నగరాలకు మూడు హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించడం తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడుతుందని, దేశ భవిష్యత్తుకు పునాది అయిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ (మూలధన వ్యయం) కోసం ఈసారి రికార్డు స్థాయిలో రూ. 12 లక్షల కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన వ్యవసాయం, డెయిరీ, పౌల్ట్రీ, అనుబంధ రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారని, చేనేత రంగానికి కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించారని, విదేశీ దిగుమతులు తగ్గించి, స్వదేశీ ఉత్పత్తులను పెంచే దిశగా అనేక పథకాలను ప్రకటించారని, సర్వీస్ సెక్టార్‌ను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఈ బడ్జెట్ వికసిత భారత్ – 2047 లక్ష్య సాధనకు గట్టి పునాది వేసిందని, సకల వర్గాల ప్రజల ఆశయాలకు అద్దం పట్టేలా ఈ బడ్జెట్ ఉందని ఆయన పేర్కొన్నారు.