- ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్ డాక్టర్ కాపర్తి గురుచరణం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రతీ హిందువును స్వయంసేవక్ గా తయారు చేయడమే శతాబ్ది లక్ష్యమని అందుకోసం రానున్న విజయదశమి నుంచి సంవత్సర కాలం పాటు ప్రతీ హిందూ గృహాన్ని కలవడం ,ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనిని వివరించడం, బస్తీ ఆధారంగా హిందూ సమాజాన్ని కలిపి ఉంచడం కోసమే వివిధ కార్యక్రమాలను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్ కంటేశ్వర్, నాందేవ్ వాడ ఉప నగరాల ఆధ్వర్యంలో న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని కమ్యూనిటీ హాల్ లో ఆదివారం నిర్వహించిన గణవేశ్ ధారి స్వయంసేవకుల సంఘీక్ కార్యక్రమానికి ముఖ్య వక్త గా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ వ్యక్తి మారితేనే సమాజం మారుతుంది అని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ సూచించిన మార్గాన్ని అనుసరించి ప్రతీ వ్యక్తిని దేశభక్తుడిగా,శ్రేష్టమైన హిందువుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా 100 సంవత్సరాల ప్రయాణాన్ని కొనసాగించామని,ఈ వందేళ్ల ప్రయాణంలో ఎన్నో అవమానాలు,నిర్బంధాలు,ఆటుపోట్లు ఎదురైనప్పటికీ వ్యక్తి నిర్మాణం ద్వారా హిందూ సంఘటన తద్వారా విశ్వ గురు పీఠం మీద మళ్ళీ భారతదేశాన్ని స్థాపించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యక్తి బాగుంటే కుటుంబం , కుటుంబం బాగుంటే సమాజం,సమాజం బాగుంటే దేశం బాగుంటుందనే మూల సూత్రాన్ని ప్రతీ హిందువు కుటుంబానికి అర్థం చేయించడం కోసం దేశవ్యాప్తంగా జనజాగరణ చేయనున్నట్లు వారు చెప్పారు. సామాజిక సమరసత,ప్రకృతి పరిరక్షణ,కుటుంబ వ్యవస్థ యొక్క సంరక్షణ ఆధారంగా బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మాణం చేయడం కోసమే సంఘము పని చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవాహ అర్గుల సత్యం, ఉపనగర కార్యవాహలు మధుకర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
