- ఎమ్మెల్సీ విజయశాంతి
- కామారెడ్డిలో పర్యటించిన ఎమ్మెల్సీల బృందం
కామారెడ్డి, బతుకమ్మ : భారీ వర్షాలతో వరదలు వచ్చి కామారెడ్డి ప్రజలు పడుతున్న బాధలు తెలంగాణ బీజేపీ పట్టవా అని ఎమ్మెల్సీ విజయ శాంతి ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ బృందం పర్యటించింది. ఇటీవల కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన హౌజింగ్ బోర్డు కాలనీ, జీఆర్ కాలనీలో ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శకంర్ నాయక్, బల్మూరి వెంకట్ లు పర్యటించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తో కలిసి పర్యటించారు. రెండు కాలనీలో జరిగిన ఆస్తి నష్టాన్ని బాధితుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా రెండు కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇళ్ళకు జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, స్థానికులు ప్రభుత్వం ద్వారా అందించే సహాయాన్ని పెంచి ఇవ్వాలని కోరారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో జరిగిన నష్టం గురించి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ వారికి తెలియజేశారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2018ఎన్నికల సమయంలో కామారెడ్డికి ప్రచారం నిమిత్తం వచ్చానని, అప్పుడున్న కామారెడ్డి, ఇప్పుడున్న కామారెడ్డిని చూస్తే బాధేస్తుందని ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. ఒక్కో ఆడబిడ్డ వారి పరిస్థితి చెప్తుంటే ఏం మాట్లాడాలో ఆర్థం కాలేదన్నారు. కాలనీ వాసుల పరిస్థతి చూసి కన్నీళ్లు వచ్చాయన్నారు. ఈ పరిణామం ఎవరూ ఊహించనిదని పేర్కొన్నారు. ప్రజల బాధ కళ్లారా చూశాక వారు అనుకున్న దానికన్నా ఎక్కువే ప్రభుత్వం ఇచ్చేలా చూస్తామన్నారు. ప్రజలు ఇంతలా అల్లాడుతుంటే బీజేపీ ఏం చేస్తుందని విజయశాతం ప్రశ్నించారు. తెలంగాణలో 8మంది ఎమ్మెల్యేలు, 8మంది ఎంపీలను ఇక్కడి ప్రజలు గెలిపించారని గుర్తుచేశారు. ఇలాంటి సమయంలో కేంద్రమే ముందుకు వచ్చి నష్టపరిహారం ఇస్తామని చెప్పాల్సిందన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గిరిజ షెట్కార్, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు, నాయకులు పాల్గొన్నారు.

