- జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు
- అదనపు జిల్లాజడ్జి శ్రీనివాస్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మత్తు పదార్తాలకు అలవాటు పడి, వ్యసనపరులై,అనారోగ్యం పాలైన వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిది ద్దడానికి న్యాయవ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థలు సమన్వయంతో కార్యాచరణకు కార్యరూపం ఇచ్చాయని నిజామాబాద్ రెండవ అదనపు జిల్లాజడ్జి టి. శ్రీనివాస్ తెలిపారు.నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సోమవారం ఆయన నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ లతో కలిసి లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రారంభించి ప్రసంగించారు. డ్రగ్స్ అనే మత్తు మనుషులను వ్యసనాలకు బానిసలుగా మార్చివేస్తున్న వైనం అభివృద్ధి చెండుతున్న ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మత్తు పదార్థం అనేది వ్యసనంగా మారితే పౌరుల ఆరోగ్యం అగమ్యగోచరంగా మారిపోతుందని జడ్జి శ్రీనివాస్ అన్నారు.డ్రగ్స్ వ్యసనానికి బాధితులైన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యపరమైన చికిత్స అందించి వారిని మామూలు ఆరోగ్య స్థితికి తీసుకురావడానికి వైద్య బృందం కృషి చేస్తుందని తెలియజేశారు. మత్తు వ్యసనం నుండి ఆరోగ్య వంతులైన వారికి పునరావాసం కల్పించే బాధ్యతల బరువు కూడా అధికారిక వ్యవస్థలు తీసుకుంటాయని ఆయన తెలిపారు.డ్రగ్స్ బాధితులపై ఏమైనా క్రిమినల్ కేసులు ఉంటే వాటి న్యాయపరమైన చిక్కులను విప్పి న్యాయ సహాయం అందిచడానికి లీగల్ ఎయిడ్ క్లినిక్ లు సహాయకారులుగా ఉంటాయని అదనపు జిల్లాజడ్జి శ్రీనివాస్ తెలిపారు.సమాజంలోని వివిధ వర్గాలకు, బీదబిక్కిలకు బలమైన గొంతుకగా, న్యాయ సహాయకారిగా న్యాయసేవ సంస్థ నిలుస్తున్నదని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు తెలిపారు.మత్తు పదార్తలకు బానిసలైన, బాధితులైన వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేధార్, డిప్యుటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఉదయ కృష్ణ, ప్రమోద్, న్యాయవాదులు ఆశ నారాయణ, బాలరాజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
