- ఆర్ అండ్ బి అధికారుల తీవ్ర నిర్లక్ష్యం
బతుకమ్మ, బిచ్కుంద : ఓ పాంత అభివృద్ధిలో రవాణా వ్యవస్థ ప్రధానమైనది. ఆ ప్రాంతం అభివృద్ధి అక్కడి రహదారులను చూస్తే అర్థమవుతుంది. ప్రజల జీవన వ్యవస్థలో రహదారుల పాత్ర ముఖ్య భూమిక. మానవుడి గమ్య స్థానం ఏదైనా జీవనయానం రోడ్డు లేకుండా ముందుకు సాగదనేది జగమెరిగిన సత్యం. అంత ప్రాధాన్యత ఉన్న రోడ్లు బిచ్కుంద మండల కేంద్రం లో అత్యంత దయనీయంగా మారింది. బిచ్కుంద మండల కేంద్రంలో సుమారు రెండున్నర కిలోమీటర్ల సెంట్రల్ లైటింగ్ ఆర్ అండ్ బీ రోడ్డు నరకప్రాయంగా మారింది. అడుగడుగునా గుంతలతో ప్రయాణికులకు చుక్కలు చూపుతూ.. ప్రాణ సంకటంగా మారాయి. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వం వెరసి రెండేళ్ల కింద టెండర్లు పూర్తయినా రోడ్డు పనులు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారాయి. ఇది బిచ్కుంద మండల కేంద్రంలోని సెంట్రల్ లైటింగ్ ప్రధాన రహదారి పరిస్థితి.
మండల కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తా అవతలి వైపు నుంచి బస్టాండ్ మీదుగా మున్నూరు కాపు సంఘం వరకు సుమారు రూ. 12 కోట్ల రూపాయలతో పనులను కే వై ఎస్ కన్స్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకుంది. అంబేద్కర్ చౌరస్తా నుంచి మున్నూరు కాపు సంఘం వరకు అక్కడక్కడా పాడైన రోడ్డు పనులు చేసినప్పటికీ సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయకుండానే చేతులెత్తేశారు. ఆర్ అండ్ బీ అధికారులకు, కేవైస్ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్లతో పరస్పర అంగీకారాలు ఉండడంతోనే రోడ్డు పనులు చేయకున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత రద్దీగా ఉండే ఈ రహదారి పనులపై సంబంధిత అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం అనుమానాలకు బలం చేకూరుతోంది. నిత్యం అధిక బరువుతో ప్రయాణించే వందలాది ఇసుక లారీలు, భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు పూర్తిగా ధ్వంసమై మీటరు లోతు గుంతలతో దర్శనమిస్తూ ప్రయాణం నరకప్రాయంగా మారినా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి మూడు కి.మీ దూరంలో ఉన్న అయ్యప్ప ఆలయానికి వెళ్లేందుకు 5 నిమిషాల్లో ప్రయాణం కానీ, 15నిమిషాల నుంచి సుమారు అరగంట పడుతుందంటే ఆ రోడ్డుపై ప్రయాణం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
- ఆపద సమయంలో అంతే సంగతులు..
అత్యవసర రోడ్డు ప్రమాద సమయాల్లో గర్భిణులు, వృద్ధులు అత్యవసర వైద్య సేవల కోసం బిచ్కుంద, బాన్స్వాడ లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తుంటారు. ఆ గుంతల రోడ్డుపై ప్రయాణించి ఆసుపత్రికి చేరుకునే లోపే సరైన వైద్యం అందక జరగాల్సిన నష్టం జరుగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు జీవనోపాధి కోసం బిచ్కుంద నుంచి బాన్సువాడకు ఆటోలు నడుపుకునే యజమానులు, డ్రైవర్లు, ద్విచక్ర వాహనాలపై కూలి పనులకు వెళ్లే కూలీలు గుంతలు పడిన రోడ్డుపై ప్రయాణం చేస్తూ తమకు వచ్చే ఆదాయం వాహనాలు రిపేర్లు చేయించుకోవడానికే సరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రణాలు కోల్పోయిన ఘటనలు కోకొల్లలు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఆర్ అండ్ బీ అధికారులు వెంటనే స్పందించి మధ్యలోనే ఆగిపోయిన రోడ్డు పనులను ప్రారంభించాలని, పనులు ప్రారంభం అయ్యే లోపు అధికారులు తాత్కాలికంగా గుంతలను పూడ్చి వాహనదారులను, ప్రజలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
