అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్, బతుకమ్మ : ప్రధానమంత్రి శ్రీ నిధుల ద్వారానే శంకర్ భవన్ పాఠశాల అభివృద్ధి జరుగుతుందని, రాష్ట్రంలో ఉత్తమ పాఠశాలగా శంకర్ భవన్ పాఠశాలను తీర్చిదిద్దాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ విద్యా శాఖ అధికారులకు సూచించారు. నగరంలోని కోటగల్లి శంకర్ భవన్ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరై మాట్లాడారు. కేంద్రప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, మౌలిక సదుపాయాల నాణ్యతను మెరుగుపరచడానికి పీఎం శ్రీ పథకం కింద శంకర్ భవన్ పాఠశాల ఎంపిక చేసిందన్నారు. గతేడాది రూ. 27 లక్షలు, అటల్ టింకరింగ్ ల్యాబ్ కోసం రూ.10 లక్షల నిధులు కేటాయించిందన్నారు. గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాలు మన ఊరు మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాలలు పథకాలు పేరుకే పరిమితం అవుతున్నాయని, ప్రభుత్వ బడులు మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. నియోజకవర్గంలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమన్నారు. శంకర్ భవన్ పాఠశాల అభివృద్ధికి తన ట్రస్ట్ ద్వారా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు షీల్డ్ బహుమతులను ఎమ్మెల్యే అందించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మండల అధికారి సాయ రెడ్డి, హెడ్ మాస్టర్ రాంచందర్, అమ్మ ఆదర్శపాఠశాల కమిటీ చైర్ పర్సన్ గోదావరి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.