- రవాణా శాఖా అనుమతి లేకుండా తుక్కు కింద అమ్మకాలు
- దొంగిలించిన వాహనాలను గంటల వ్యవధిలో తుక్కులా మార్చి అమ్మకాలు
- ఫైనాన్స్ సీజీంగ్ వాహనాలను విడి భాగాలుగా చేసి అమ్మకాలు
- రియాజ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో తెరపైకి స్క్రాఫ్ మాఫియా
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలు ఇది వరకు కలప స్మగ్లింగ్ కు ఫేమస్… ఆవ్యవహారంలో ఆధిఫత్యం విషయంలో ఇందూర్ లో మర్డర్ లు జరిగాయి. దాని తరువాత వచ్చిందే గంజాయి దందా… ఈ దందాలో చాలామంది ఆరి తేరారు. గంజాయి మత్తులో జరుగని నేరాలు లేవు. గంజాయి కిక్కులో హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, దొమ్మీలు, దొంగతనాలకు కొదవ లేదు.. ఆ అతరువాత వచ్చింది రేషన్ (పీడీఎస్ బియ్యం) మాఫియా. ఈ వ్యవహారంలో మామూళ్ల కోసమే జిల్లా కేంద్రంలో రెండు హత్యలు జరిగాయి. పీడీయస్ దందాల నిర్వాహకుల ఆధ్వర్యంలో హత్యాయత్నాలు, సుపారీ గ్యాంగ్ లను రంగంలోకి దించి కత్తులతో దాడులు, తుపాకీలతో బెదిరింపులకు అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరో మాఫియా వ్యవహారం కలకలం రేపుతోంది. అదే స్ర్కాఫ్ మాఫియా. పాత ఇనుప సామాన్ మాటున వాహనాలను తుక్కు తుక్కు కింద విడగొట్టి అమ్మకాలు చేసే వ్యవహారం పోలీసులకు సవాల్ విసురుతుంది. కాలం చెల్లిన వాహనాలను తుక్కు తుక్కు కింద చేసి రవాణా శాఖా అనుమతితో విక్రయిస్తే పరువాలేదు కాని, ఏకంగా దొంగిలించిన వాహనాలను, పైనాన్స్ సీజింగ్ బండ్లను పార్టులు పార్టులుగా చేసి విడిభాగాలను అమ్ముతుండటం కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెలలో సీసీఎస్ కానిస్టేబుల్ ను హత్య చేసి పరారైనా రియాజ్ స్క్రాప్ దందా నిర్వాహకుల నుంచి రావాల్సిన డబ్బుల కోసం వచ్చి పోలీసులకు చిక్కి తరువాత హాస్పిటల్ లో ఎన్ కౌంటర్ లో హతమైనట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రౌడీషీటర్లకు చాలామందికి అసాంఘీక కార్యకలాపాలే ఆదాయ వనరులు. చాలా మందిపై అత్యధికంగా దొంగతనాల కేసులే ఉన్నాయి. అందులో ఇండ్లలో దొంగతనాలు, దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్ లు బైక్ లు, ఆటోల చోరీ కేసులు ఎక్కువ. ఇంకా కొందరు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్ లలోని రాగి తీగల చోరీ కేసులు ఉంటే మరికొందరిపై మేకలు, గొర్రెలు, పశువుల దొంగతనాల కేసులు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఉత్తర తెలంగాణ నుంచి మొదలుకొని హైద్రాబాద్ వరకు లారీలు, డీసీయం మాయమై అడ్రస్ లేకుండా పోతున్నాయి. అందులో కొన్ని కాలం చెల్లిన వాహనాలుగా వాహనాలను తుక్కు తుక్కుగా మార్చి అమ్మే నిజామాబాద్ కు చేరుతున్నాయి. మరికొన్ని ఫైనాన్స్ సీజింగ్ వాహనాలను తుక్కుగా మార్చే గ్యాంగ్ లకు అమ్ముకుంటున్నాయి. తీరా యజమానులు, ఫైనాన్స్ సంస్ధలు నిలదీస్తే తమ వాహనాలు దొంగతనంకు గురయ్యాయని చెప్పి తప్పించుకుంటున్నారు. కాలం చెల్లిన వాహనాలను ధ్వంసం చేయాలంటే రవాణా శాఖ అనుమతి తప్పని సరి. కాలం చెల్లిందని వాహనాలను గుర్తించి సర్టిఫై చేసిన వాహనాలను విడి భాగాలుగా చేసి పనిచేసే వాటిని పార్టు పార్టులుగా, పనికి రాని వాటిని తుక్కు తుక్కుగా అమ్మడం సర్వసాధారణం. కాని నిజామాబాద్ లో పైనాన్స్ సీజీంగ్ భయం కలిగిన వాహనాలను, చోరీ వాహనాలను కుడా స్క్రాఫ్ గా చేసి అమ్మకాలు చేస్తుండటం గమనార్హం.
నిజామాబాద్ నగరంలో కొందరు మాత్రమే అధికారికంగా రవాణా శాఖా అనుమతితో కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్ గా మారుస్తున్నారు. మరికొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే ఆపని చేస్తున్నారు. ఇది కొందరు వాహనాల దొంగలకు వరంగా, పోలీస్ లకు సవాల్ గా మారింది. పోలీస్ రికార్డులలో చోరీకి గురైన వాహనాలను తుక్కు వ్యాపారులు గంటల వ్యవధిలో వాటిని పార్టులు పార్టులుగా విడగొడుతున్నారు. వాటిలో చేసీస్ ఇంజన్ నంబర్ లను తుడిచి వేసి అమ్మకాలు చేస్తున్నారు. కొందరు మహారాష్ట్రలో విడి భాగాలను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు ఖద్ధరు వేసుకున్న పెద్ద మనుషుల ముసుగు ఉన్నవారు ఈ వ్యవహారంలో ఉండటంతో ఈ విషయం బహిర్గతం కావడం లేదని తెలిసింది. ఆంధ్రలోని బెజవాడ ఆటోనగర్ కు చెందిన వారిని రప్పించి వారిద్వారా వాహనాలను గంటల వ్యవధిలో ఆనవాళ్లు లేకుండా మాయం చేయిస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఈ వ్యవహారం పోలీస్ ల వరకు చేరిన కాసులు ఇచ్చి మేనేజ్ చేశారని వినికిడి. ఇటీవల పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమైన రియాజ్ బైక్ లను దొంగిలించి గంటల వ్యవధిలో వాటి చేసిస్ నంబర్ లను తుడిచి వేసి మహారాష్ట్రలో అమ్మకాల వెనుక నిజామాబాద్ స్ర్కాప్ మాఫియా హస్తం ఉన్నట్టు తెలిసింది. కానిస్టేబుల్ ను హత్య చేసి పరారీలో ఉన్న రియాజ్ ఆర్థికంగా ఇబ్బందులు ఉండి తనకు స్క్రాఫ్ వ్యాపారుల వద్ద రావాల్సిన డబ్బుల కోసం రావడంతో చిక్కినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రియాజ్ తో పాటు చోరీల కేసులలో ఉన్నవారిని పట్టుకుంటేనే గాని స్క్రాప్ మాఫియా వ్యవహారం బట్ట బయలు అయ్యే అవకాశం ఉంది.

