చందాలు వేసి.. రోడ్డు నిర్మాణం
. . . మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు చెప్పి అలసిపోయిన కాలనీ వాసులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అభివృద్ది పనులకు నిధుల కొరత ఎదుర్కొంటుంది. పేరుకు 60 డివిజన్ లు కాగా అందులో నిజామాబాద్ అర్బన్ , నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాలకు చెందిన డివిజన్ లు ఉన్నాయి. పాలకులు మారినా ఇక్కడ పనులు మాత్రం అటకేక్కినాయి. దానితో డ్రైనేజీల పనులు, రోడ్ల విస్తరణ, వీధి దీపాల ఏర్పాటు పనులు కూడా జరుగడం లేదు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వం మారిన పాత పనులకు మోక్షం కలిగించడంలో అవి నత్తతో పోటిపడుతున్నాయి. ప్రజల అవసరాల కంటే స్థానిక లీడర్లు ప్రాధాన్యత క్రమంలో పనులు జరుగుతుండటంతో ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతుంది. నిజామాబాద్ ఆర్మూర్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న 3 వ డివిజన్ లో రోడ్ల నిర్మాణం కోసం పలు మార్లు విన్నవించిన ఫలితం లేకపోవడంతో స్థానిక కాలనీ వాసులు చందాలు వేసి పనులు చేపట్టడం గమనార్హం.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 3 వ డివిజన్ లోని మహాలక్ష్మి కాలనీ లో గల సాయి టవర్స్ వాసులు.. చందాలు వేసి రోడ్డు నిర్మించుకున్నారు. కాలనీ లో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంత కాలంగా రోడ్డు గుంతల మయంగా మారింది. ఆ రోడ్డు వెంట వెళ్ళిన పలువురు గుంతల్లో పడి గాయపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాల కు గుంతల్లో నీళ్లు చేరి.. పిల్ల కాలువలను తలపించింది రోడ్డు. ఈ క్రమంలో సాయి టవర్స్ వాసులు మున్సిపల్ అధికారులకు తమ సొసైటీ నుంచి వినతి పత్రం అందించారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడం తో సాయి టవర్స్ అపార్ట్ మెంట్ వాసులు చందాలు వేసుకుని రోడ్డు పై పడ్డ గుంతలను పూడ్చారు. గతుకుల రోడ్డు ను కాస్తా అందంగా ముస్తాబు చేశారు. కాలనీ లో డ్రైనేజీ సౌకర్యం, తాగునీటి సౌకర్యం లేదని అధికారులు స్పందించి డ్రైనేజీ, తాగునీటి వసతి కల్పించాలని లేని పక్షంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్క రించాలని నిర్ణయించారు. మున్సిపల్ అధికారులకు ఇంటి పన్నులు సైతం చెల్లించవద్దని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సాయి టవర్స్ వెల్ఫర్ సొసైటీ అధ్యక్షులు మహేష్, కార్యదర్శి బాల్ రావు, కోశాధికారి రాజు, సలహాదారులు సింహాచలం, సంజీవ రెడ్డి, వరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

