- డీసీసీ, సీసీసీ పీఠాల కోసం దరఖాస్తులు
- అభిప్రాయాల సేకరణ చేయనున్న కమిటీ
నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీలో పార్టీ పదువుల పందేరం కొనసాగుతుంది. అధికారం చేపట్టిన తర్వాత పీసీసీ పదవులను భర్తీ చేసిన అధిష్టానం ఇటీవల జిల్లా, పట్టణ కాంగ్రెస్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు కాంగ్రెస్ పార్టీ పదవుల భర్తీ నిమిత్తం ఇంచార్జిలను నియమించింది. కాంగ్రెస్ పార్టీలో పదువులను భర్తీ చేయడమే లక్ష్యంగా కొత్త కమిటీలు అన్నీ జిల్లాలకు నియమించడం 12 వరకు దరఖాస్తులను స్వీకరించారు. నిజామాబాద్ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 12 దరఖాస్తులు రాగా సిటీ కాంగ్రెస్ కు ఏడు దరఖాస్తులు వచ్చాయి. కామారెడ్డి జిల్లాలో షబ్బీర్ ఆలీకి నలుగురు వ్యక్తిగతంగా దరఖాస్తులు ఇచ్చినట్లు తెలిసింది. కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ కమిటీ పదవికి దరఖాస్తులు సోమవారం నమోదయ్యే అవకాశం ఉంది.
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మార చంద్రమోహన్, కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగెట్ శేఖర్ గౌడ్ తో పాటు సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, మాజీ మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు జావేద్ అక్రంతో పాటు ఆర్మూర్ కు చెందిన అయ్యప్ప శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్ యాదవ్, నటరాజ్, సాయికుమార్, మహ్మద్ సలీమొద్దీన్, ముషు పటేల్, ఇమ్మడి గోపి, జగడం సుమన్, ఎం.ఏ.హలీంలు జిల్లా కాంగ్రెస్ పదవి కోసం పోటీ పడుతున్నారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్, పార్లమెంట్ యూత్ మాజీ అధ్యక్షులు, ఎన్ ఎస్ యూఐ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు, తెలంగాణ యూనివర్సిటీ ఎన్ ఎస్ యూఐ మాజీ అధ్యక్షులు పంచరెడ్డి చరణ్, సీటీ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కాపుకర్ గన్ రాజ్, అంతిరెడ్డి విజయ్ పాల్ రెడ్డి, మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, మాజీ మైనార్టీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జావేద్ అక్రం, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బొబ్బిలి రామక`ష్ణ, మహ్మద్ కరీమొద్దీన్ లు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కాంగ్రెస్, సిటీ కాంగ్రెస్ పదవుల కోసం పోటీ పడుతున్న వారిలో అత్యధికంగా గతంలో పదవులు అనుభవించిన వారు ఉన్నారు. మహిళలు అయితే ఇప్పటి వరకు ఒక్కరూ కూడా దరఖాస్తు చేసుకోకపోవడం విశేషం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సీనియర్లతో పాటు కొత్త వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. రాజకీయ వారసులతో పాటు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కని వారు పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఈసారి పార్టీ పదవులను పార్టీ కోసం పని చేసే వారికే ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో పరిశీలకులు వారం రోజుల పాటు దరఖాస్తు చేసుకున్న వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోనుంది. సంబంధిత నివేదికను పీసీసీకి అందించనుంది. పీసీసీ, ఎఐసీసీ ఆదేశాల మేరకు జిల్లా, సిటీ కాంగ్రెస్ పదవులను భర్తీ చేయనున్నారు. ఈసారి పార్టీ పదవుల భర్తీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆశీస్సులు ఉన్న వారికే నిజామాబాద్ పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతుంది. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కడం వెనుక ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారుల అభిప్రాయాల ప్రకారం జరుగుతాయని తెలుస్తోంది.
