27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కంపార్ట్ మెంట్ నంబర్ 205లో వనమేధం

Must read

📰 Generate e-Paper Clip

  • ఇంటికి ఐదు ఎకరాల చొప్పున అటవీ భూమి కబ్జాకు యత్నం
  • వందలాది చెట్ల నరికివేసి పోడుకు ఏర్పాట్లు
  • ఆలస్యంగా గుర్తించి నోటీసులు, కేసులకు పరిమితం
  • నిర్లక్ష్య విధుల అటవీ సిబ్బందిపై చర్యలేవి

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ మండలంలోని లింగితాండ శివారులో జరిగిన వంద ఎకరాల అటవీ భూమి కబ్జా వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మే మాసం నుంచే మల్లారం సెక్షన్ పరిధిలోని ముత్తకుంట బీట్ లోని కంపార్ట్ మెంట్ నంబర్ 205లో అటవీ భూమికబ్జాకు యత్నాలు మొదలయ్యాయి. స్థానికంగా ఉన్న లింగితాండకు చెందిన గ్రామస్తులు మూకుమ్ముడిగా అటవీ భూమిని కబ్జాకు శ్రీకారం చుట్టారు. గ్రామం అంతా ఏకతాటిపైకి వచ్చి భూ కబ్జాలకు దిగారు. కంపార్ట్ మెంట్ నంబర్ 205లో ఉన్న చెట్లను నరికివేసి చదునుకు శ్రీకారం చుట్టారు. ఆలస్యంగా సెప్టెంబర్ లో అటవీ శాఖాధికారులు గుర్తించే సరికి జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. అటవీ భూమిలో ఉన్న చెట్లను నరికివేసి జేసీబీలతో చదును చేసిన పట్టించుకోకపోవడంతో పంటల పోడుకు అనుగుణంగా స్థలాన్ని చదును చేసేశారు.

Vanamedham in compartment number 205

అటవీ భూమిలో కబ్జాలు జరిగాయని ఆలస్యంగా గుర్తించిన నిజామాబాద్ నార్త్ రేంజ్ అధికారులు విషయాన్ని పెద్దదిగా చూపకుండా ఉండేందుకే యత్నించారని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కంపార్ట్ మెంట్ నంబర్ 205లో మూకుమ్ముడిగా కబ్జా కోసం చెట్లు నరికి చదును చేసిన వారిని గుర్తించడంలో విఫలమయ్యారు. వందల మంది ఈ ప్రయత్నం చేయగా పది మందికి అటవీ శాఖాధికారులు నోటీసులు ఇచ్చారు. 12 మందిపై స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసుల నమోదుకు అధికారులు విచారణ చేపట్టారు. స్థానికంగా లింగితాండ గ్రామానికి చెందిన వారిలో కబ్జా చేసింది కొందరైతే నోటీసులు ఇతరులకు ఇచ్చినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా అటవీ శాఖ అనుమతులు లేకుండా చెట్లు నరికితే జరిమానా కేసులు నమోదు చేసే అటవీ శాఖాధికారులు వంద ఎకరాల భూమిని చెర బట్టేందుకు యత్నించగా వారిపై తెలంగాణ అటవీ చట్టం 1967, వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం చర్యలు తీసుకునేందుకు యత్నించడం అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దాదాపు 40 నుంచి 50 మంది చెట్లను నరికి పోడుకు సిద్దం చేస్తే కొందరికే తాఖీదులు ఇవ్వడం అనుమానాలకు బలాన్ని చేకూర్చుతున్నాయి.

ముత్తకుంట బీట్ లోని 205 కంపార్ట్ మెంట్ లో 100 ఎకరాల అటవీ భూమి కబ్జా కోసం చెట్లను నరికి పోడుకు సిద్దం చేసేందుకు నాలుగు నెలలుగా పనులు జరుగుతుంటే అటవీ అధికారులు చోద్యం చూడడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మల్లారం సెక్షన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో అటవీ అధికారులు, సిబ్బందికి ప్రమేయం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో సిరికొండ అటవీ ప్రాంతంలోని జెంగిలోడి తాండలో జరిగిన ఆక్రమణ ఉదంతం లాగానే ముత్తకుంట బీట్ లో అటవీ భూమి కబ్జా ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలున్నాయి. ముత్తకుంట బీట్ లో జరిగిన అటవీ భూమి కబ్జా ప్రయత్నాలు ఇప్పుడు స్థానికంగా కుర్నాపల్లి, ఠాణాకలాన్ శివారులోని భూముల కబ్జాకు ప్రేరణగా నిలిచాయన్న వాదనలు ఉన్నాయి. కొందరు ముత్తకుంట బీట్ లో అటవీ భూమి కబ్జా జరిగితే చర్యలు తసుకోలేరు, తమపై ఏం చర్యలు తీసుకుంటారన్న ధీమాతో ఉన్నారు. అటవీ అధికారులపై చర్యలు తీసుకుంటే కానీ కబ్జాలు  ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ముత్తకుంటలో జరిగిన అటవీ భూమి ఆక్రమణపై కొందరు సీసీఎఫ్ కు ఫిర్యాదు చేయగా త్వరలో విచారణకు రానున్నట్లు సమాచారం.

Vanamedham in compartment number 205

More articles

Latest article