25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

యథేచ్ఛగా మొరం అక్రమ తవ్వకాలు

Must read

📰 Generate e-Paper Clip

  • అనుమతుల పేరిట మొరం అక్రమ దందా

 

బతుకమ్మ, బిచ్కుంద : మొరం దందా అక్రమ యథేచ్ఛగా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు సహజ సంపదను కొల్లగొట్టి ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. బిచ్కుందలో మొరం తవ్వకాలు జరుపుతున్న స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు సాగిస్తుండడంతో లక్షల రూపాయల్లో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.  బిచ్కుంద గ్రామంలోని  శివారులో ఉన్న గుట్టలను కొందరు అక్రమార్కులు అనుమతులు పేరిట అక్రమ తవ్వకాలు జరుపుతూ గుట్టలను కరిగిస్తున్నారు. గుట్టను పందికొక్కుల తోడేస్తున్నారు. నిఘా బెట్టి చర్యలు చేపడుతున్నామని రెవెన్యూ అధికారులు చెబుతున్నా.. ఈ అక్రమ దందా వ్యాపారంలో పాత్ర ఉన్న బడా రాజకీయ నాయకుల మొరం మట్టి తరలింపు ట్రాక్టర్లను పట్టుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • ఏం జరుగుతోంది:

రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందు కోగా, ఎక్కడపడితే అక్కడ వెంచర్లు వెలిశాయి. బిచ్కుంద పట్టణ, పరిసర గ్రామాల్లో వెలసిన వెంచర్లకు, గృహ నిర్మాణాలకు మొరం అవసరం కావడంతో బిచ్కుంద లోని గుట్టల పై అక్రమ వ్యాపారుల కన్ను పడింది. గుట్టను తోడేస్తూ మొరం తవ్వకాలు చేస్తుండటంతో రాబోయే రోజుల్లో గుట్టలు కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతోంది. అక్రమ వ్యాపారులు జేసీబీ యంత్రాలతో రాత్రి పగలు తేడా లేకుండా గుట్టల్లో మొరం మట్టిని తోడేస్తూ ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా వెంచర్ లకు, గృహ నిర్మాణాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఒక్కొక్క ట్రాక్టర్ లోడ్ మొరం మట్టికి రూ.650 నుంచి రూ.700 వరకు, దూరం ఎక్కువైతే అదనంగా మరో రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేసుకుంటున్నారు. టిప్పర్ లోడ్ మొరానికి రూ 3వేల నుంచి రూ. 3500 తీసుకుంటూ లక్ష రూపాయల్లో అక్రమార్జన చేస్తూ మూడు పువ్వులు ఆరు కాయలు గా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గుట్టని తోడేస్తున్న వారిలో కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ అధికారులు అక్రమ మొరం మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకుంటున్నా.. అందులో అక్రమ వ్యాపారం చేస్తున్న రాజకీయ నాయకులు కాకుండా మామూలు వ్యక్తులు పట్టు పడుతుండటం గమనార్హం.

  • నిబంధనలు బేఖాతరు..

ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో మొరం, మట్టి తవ్వకాలు చేపట్టాలంటే మండల రెవెన్యూ, భూగర్భ గనుల అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ మేరకు వాల్టా చట్టం ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి తవ్వకాలు చేపట్టాలి. ఆ నిబంధనలను తుంగలో తొక్కుతూ అక్రమార్కులు గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయమై బిచ్కుంద ఆర్ ఐ  రవీంద్రనాథ్ ను సంప్రదించగా ఎలాంటి అనుమతులు లేకుండా మొరం మట్టిని తరలించే వారిపై తగు చర్యలు చేపడుతున్నామన్నారు. అక్రమంగా మొరం మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు ఎంతటి వారి వైనా సరే పట్టుకుని సీజ్ చేస్తున్నామన్నారు.

More articles

Latest article