. . . చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
. . . రాష్ట్ర సహాకార యునియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
కమ్మర్‌పల్లి, బతుకమ్మ :
రాష్ట్రంలో రబీ సీజన్ వరి కొనుగోళ్ల అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కమ్మర్‌పల్లిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన మానాల మోహన్ రెడ్డి, గత మూడు నాలుగు రోజులుగా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వరి కొనుగోళ్లు నిర్వహిస్తుండగా, ప్రతిపక్షాలు అసత్య ప్రచారంతో ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది ఐదో సీజన్ వరి కొనుగోలు కార్యక్రమమని పేర్కొన్న ఆయన, ఈ కాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఇటీవల లారీల కొరత, రైస్ మిల్లుల్లో నిల్వ సమస్యల కారణంగా కొంత ఆలస్యం జరిగిన మాట నిజమేనని అంగీకరించినప్పటికీ, ప్రభుత్వం ఎక్కడా వరి కొనుగోలు చేయబోమని చెప్పలేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) నిర్ణయించే కేంద్రం, కొనుగోలు బాధ్యతను కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం సేకరిస్తున్న భారీ పరిమాణంలోని ధాన్యంలో కేంద్రం పరిమిత మొత్తాన్ని మాత్రమే తిరిగి స్వీకరిస్తామని చెప్పడం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ నేతలు గత పాలనలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను మరిచిపోయి ఇప్పుడు విమర్శలు చేయడం విచారకరమని మానాల మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, గత ప్రభుత్వ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోళ్లను వేగవంతం చేస్తోందని, దాదాపు 95 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన కొద్ది కేంద్రాల్లో ఉన్న సమస్యలను కూడా త్వరలో పరిష్కరించి కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. బాల్కొండ నియోజకవర్గంలోని రైతులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసిన ఆయన, ఎక్కడైనా కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ఉంటే స్థానిక కాంగ్రెస్ నాయకులకు లేదా అధికారులకు తెలియజేయాలని కోరారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, మాజీ అధ్యక్షుడు సుంకేట రవి, మాజీ డీసీసీ నాయకుడు తిప్పి రెడ్డి శ్రీనివాస్, టౌన్ అధ్యక్షుడు సాల్లూరి గణేష్, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
