30.9 C
Hyderabad
Monday, August 3, 2026

పొగాకుకు దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి, ఆర్థిక భద్రతకు రక్షణ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌లో అవగాహన ర్యాలీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆర్థిక భద్రతను కూడా కాపాడుకోవచ్చని జిల్లా ఉప వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సికిందర్ నాయక్ పేర్కొన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నిజామాబాద్ జిల్లా గౌతమ్‌నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ)లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని ఏడు యూపీహెచ్‌సీల సిబ్బంది పాల్గొన్న ఈ ర్యాలీని డాక్టర్ సికిందర్ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వైద్య సిబ్బంది పొగాకు నిర్మూలనకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ సికిందర్ నాయక్, సిగరెట్లు, బీడీలు, తంబాకు, గుట్కా, ఖైనీ, జర్దా వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల నోరు, గొంతు, ఊపిరితిత్తులు, ఆహారనాళం తదితర అవయవాలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికమని తెలిపారు. అంతేకాకుండా గుండెపోటు, అధిక రక్తపోటు, పక్షవాతం, మధుమేహం వంటి అనేక ప్రాణాంతక వ్యాధులకు కూడా పొగాకు కారణమవుతుందని హెచ్చరించారు. యువతలో సరదాగా మొదలయ్యే పొగాకు అలవాటు క్రమంగా వ్యసనంగా మారి వారి భవిష్యత్తును దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. పొగాకు వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. పొగాకు, ఇతర పొగాకు ఉత్పత్తుల నియంత్రణ చట్టం (సిఓటిపిఎ-2003) ప్రకారం 18 సంవత్సరాల లోపు వారికి పొగాకు ఉత్పత్తులు విక్రయించడం నేరమని, విద్యాసంస్థల 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు నిషేధించబడ్డాయని తెలిపారు. అలాగే బస్టాండ్లు, వ్యాపార సముదాయాలు, సినిమా థియేటర్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయరాదని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వెంకన్న, పీఓఎం‌సీహెచ్ డాక్టర్ శిఖర, డీఎస్‌వో డాక్టర్ వెంకటేష్, జిల్లా ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ శ్రావ్య, ఎన్‌సీడీ కోఆర్డినేటర్ పి. వెంకటేష్, ఫార్మసిస్టులు, ఎంపీహెచ్‌ఈవోలు, ఎంపీహెచ్‌ఎస్‌లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article