. . . వ్యవసాయ అధికారిణి నవ్య
మహమ్మద్ నగర్, బతుకమ్మ :
ఎల్ నినో ప్రభావం వల్ల ఎక్కువ నీటి అవసరం ఉన్న పంటలు కాకుంగా తక్కువ నీటి అవసరమున్న పంటలను పండించాలని మండల వ్యవసాయ అధికారిణి నవ్య అన్నారు. మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎల్-నినో దుష్ప్రభావాలు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిణి నవ్య మాట్లాడుతూ.. ఎల్-నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, దీంతో వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని తెలిపారు. రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మొక్కజొన్న, జొన్న, సజ్జలు, రాగులు, పెసర, మినుము, కంది, నువ్వులు, వేరుశెనగ, పొద్దుతిరుగుడు వంటి తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడం, వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం, నేల పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించడం, వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయిని హరిన్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి మధుసూదన్, పంచాయతీ కార్యదర్శి శిరీష, రైతులు తదితరులు పాల్గొన్నారు.