నిజామాబాద్, బతుకమ్మ :
ఎక్సైజ్ కానిస్టేబుల్ వాహనంతో ఢీకొట్టి ఆసుపత్రి పాలైన సౌమ్యకు న్యాయం జరుగాలంటూ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ కార్యాలయం ఎదుట ఎక్సైజ్ ఉద్యోగులు శనివారం విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. దీంతో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం సాయంత్రం ఎక్సైజ్ టౌన్ సిఐ, ఎస్సైలు తమ సిబ్బంది నిజామాబాద్ పట్టణంలో రూట్ వాచ్ ఆపరేషన్ సమయంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు జరిగిన ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం నగరానికి ఎండుగంజాయి తరలింపు జరుగుతుందన్ననమ్మదగిన సమాచారం మేరకు నిజామాబాద్ ఎక్సైజ్ సిఐ , సిబ్బందితో కలిసి మాదవనగర్ ప్రాంతంలో రూట్ వాచ్ నిర్వహించగా ఒక కారు తనిఖీ కోసం ఆపగా ఆ వాహనం ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టింది. దీంతో ఆమె రోడ్డుపై పడిపోగా వెంటనే సిబ్బంది చికిత్స నిమిత్తం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని సిబ్బంది తెలిపారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు జరిగిన ఘటనపై ఎక్సైజ్ సిఐ స్వప్న, కానిస్టేబుల్ హమీద్ ల ప్రమేయం ఉందని ఎక్సైజ్ ఉద్యోగులు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని నిలదీశారు. గంజాయి కేసుల విషయంలో కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తున్నారని జిల్లా ఎక్సైజ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రవి ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల పదోన్నతుల కోసం కింది స్థాయి ఉద్యోగులను బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి వాణా లేకున్నా పక్కా జిల్లా కేసుల చేదనలో ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐ స్వప్న, కానిస్టేబుల్ హమీద్ లపై తక్షణమే చర్యలు తీసుకుని సౌమ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ కార్యాలయంలో ఆందోళన చేస్తున్న ఎక్సైజ్ ఉద్యోగుల వద్దకు వచ్చిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు సోమిరెడ్డి, మల్లారెడ్డిలు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎక్సైజ్ సిఐ ప్రమేయంపై కమిటీ ఏర్పాటు చేస్తానని డిప్యూటీ కమిషనర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.