31.2 C
Hyderabad

జర్నలిస్టులు తమ వృత్తి ధర్మాన్ని నిబద్ధతతో నిర్వహించాలి

Journalists must discharge their professional duties with commitment.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

జర్నలిస్టులు తమ వృత్తి ధర్మాన్ని నిబద్ధతతో నిర్వహించాలని, ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడం, సమాజానికి సరైన దిశానిర్దేశం చేయడంలో విలేఖరుల పాత్ర ఎంతో కీలకమని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ ఎస్ఆర్ఎన్ కె  ప్రభుత్వ డిగ్రీ , పీజీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ఎలాంటి ఆశలు, ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టులు నిరంతరం కృషి చేయాలని తెలిపారు. ఒక వార్త సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, వార్తలను ప్రచురించే ముందు వాస్తవాలను పూర్తిగా నిర్ధారించుకోవడం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం అత్యంత ముఖ్యమన్నారు. వార్తల విషయంలో నిజానిజాలను పరిశీలించి, ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడం జర్నలిస్టుల వృత్తిపరమైన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి రావడంతో మీడియా రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా విస్తరణతో సంఘటనలు జరిగిన వెంటనే సమాచారం ప్రజలకు చేరుతోందన్నారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు, మారుతున్న మీడియా రంగానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని సూచించారు. జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని వృత్తిపరమైన పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో మీడియా వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా వాస్తవాధారిత వార్తలను అందించాలని ఆకాంక్షించారు. బాన్సువాడలో జర్నలిస్టుల సంక్షేమానికి గతంలోనే ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితమే బాన్సువాడలో సుమారు 60 మంది రిపోర్టర్లకు ఇళ్ల స్థలాలతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, వారి కుటుంబాల భద్రతకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

Journalists must discharge their professional duties with commitment.
 

More articles

Latest article