సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టుల కుటుంబాల కోసం వసతుల పెంపుకు చర్యలు
నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న వెల్నెస్ సెంటర్‌ను శనివారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. సీనియర్ సిటిజెన్లు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టుల కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో వసతులు, సేవలను పరిశీలించారు. వృద్ధులు, పింఛన్‌దారులు వైద్యం కోసం ఈ కేంద్రానికి వస్తున్న నేపథ్యంలో, అవసరమైన వసతుల పెంపుపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. పరిశుభ్రత, వైద్య సేవల నాణ్యత పెంపు, అవసరమైన సిబ్బంది సమకూర్చడం వంటి అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. అవసరమైన నిధులు త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అధికారులు, నుడా చైర్మన్ కేశ వేణు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు రామ్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
