నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఫ్యూచర్ లైన్ పాఠశాలలో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు బోనాల పండుగ విశిష్టత, తెలంగాణ సంస్కృతిలో దాని ప్రాముఖ్యత, పండుగకు సంబంధించిన సంప్రదాయాలు, ఆచారాల గురించి విద్యార్థులకు వివరించారు. భావితరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడం, విద్యార్థుల్లో సాంస్కృతిక విలువల పట్ల అవగాహన పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ప్రియాంక, ఇన్‌చార్జ్ లావణ్య, ఉపాధ్యాయులు సంధ్య, గౌతమి, శిరీష, మాధవి పాల్గొన్నారు. వారు విద్యార్థులకు బోనాల పండుగ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతను వివరించి, మన సంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు.

