. . . జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నాణ్యమైన విద్యాబోధన అందించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ సూచించారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్లకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన శిక్షణ పొందుతున్న అధ్యాపకులతో మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నతికి అధ్యాపకుల శిక్షణ ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి అధ్యాపకుడు విద్యార్థులను భావితరాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ చూపుతూ బోధన సాగించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల కోసం నిజామాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన తొలి విడత (ఫస్ట్ స్పెల్) రెండు రోజుల శిక్షణా తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు మాట్లాడుతూ, ఓరియంటేషన్ శిక్షణ తమ వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపరచడంలో దోహదపడిందని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బోధించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్స్‌గా సివిక్స్ అధ్యాపకులు ప్రసాద్, ఎకనామిక్స్ అధ్యాపకురాలు యమున, శివరాజ్, తెలుగు అధ్యాపకురాళ్లు లావణ్య, విజయ, హిందీ అధ్యాపకులు భోజరాం, బాలాజీ అధ్యాపకులకు బోధనా నైపుణ్యాలు, ఆధునిక బోధనా పద్ధతులపై శిక్షణ అందించారు. తెలుగు, హిందీ, సివిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులకు సంబంధించిన ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బుద్ధిరాజ్, యూ-అబ్జర్వర్ ధర్మపాల్, జిల్లా ప్రభుత్వ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు నర్సయ్యతో పాటు పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.

