- ఇసుక అక్రమ రవాణకు సహకరించిన ఖాకీలకు షోకాజ్ నోటీసులు జారీ
- 11 మంది పోలీసులపై చర్యలకు డిజిపి కార్యాలయం ఆదేశాలు
- కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సిఐలు, 9 మంది ఎస్ఐలు
- కామారెడ్డి జిల్లాలో ఆ పోలీస్ స్టేషన్ల అధికారుల పరిస్థితేంటి..?
- బదిలీ చేసి చర్యలు తీసుకుంటారా లేదా అనే సందేహా లు
నిజామాబాద్ , బతుకమ్మ: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల వెన్నుదన్ను.. చర్యలు ఏవి..? అని ఆగస్టు మాసంలో ‘ బతుకమ్మ’ లో వచ్చిన కథనానికి స్పందన లభించింది. రాష్ట్రం లో ఇసుకాసురులకు ఖాకీలు తోడు కావడంతో నదులు, వాగులు, వంకలలో ఇసుక అక్రమ రవాణాపై డిజీపి సీరియస్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇతర జిల్లాలో పలువురు సీఐలు, ఎస్ఐలకు స్థాన చలనం కలిగించారు. దాని ప్రకారం ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమాసురులకు ఖాకీల అండా వారి వివరాలను ఉన్నతాధికారులకు పంపడంలో ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీస్ లు విఫలం.. అంటు కథనం కదిలించింది. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఇద్దరు సిఐలు, 9 మంది ఎస్ఐలు ఇసుక అక్రమ రవాణాదారులతో మిలాఖాత్ అయ్యారని ఆరోపణలు వచ్చాయి. మంజీర పరివాహక ప్రాంతమైన బొధన్ నియోజకవర్గంలోని ఒక సీఐ, ఒక రూరల్ ఎస్ఐల అవినితీ విచ్చల విడిగా సాగింది. ఒక ఎస్ఐ నెలకు రూ.8 లక్షలు వసూలు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. బోదన్ నియోజకవర్గంలోని మరోక ఎస్ఐ అవినితి చిట్టా విప్పారు. బాన్సువాడ నియోజకవర్గంలో నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని రెండు పోలీస్ స్టేషన్ ల పరిధిలోను ఇద్ధరు ఎస్ఐలు ఇసుకాసురులతో మిలాఖాత్ అయినట్లు నివేధికలో ఉన్నాయి. ఇక బాల్కొండ నియోజకవర్గంలో ఒక సిఐతో పాటు, ఒక ఎస్ఐ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ముగ్గురు ఎస్ఐలు, ఆర్మూర్ నియోజకవర్గంలోని ఇద్ధరు ఎస్ఐల అవినీతి బాగోతం డిజిపి కార్యాలయం విచారణలో బట్టబయలైంది. అందులో 11 మందికి షోకాజ్ నోటిస్ లు గత పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ బదిలికి ముందు గత నెలలో జారీ చేశారు. వారిని బదిలి చేసి చర్యలు తీసుకోవాలని డిజిపి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కాని అంతకు ముందే పోలిస్ కమీషనర్ బదిలి కావడంతో చర్యలు అటకెక్కాయి. అదే విధంగా వారిని బదిలి చేసి చర్యలు తీసుకుంటారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో మంజీర పరివాహక ప్రాంతం ఉన్న ఇద్ధరు సర్కిల్ ఇన్స్ పెక్టర్లు, నలుగురు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ లపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మంజీరా నుంచి ఇసుక అక్రమ తవ్వకాలకు గస్తీ పహరా అందించడంలో వారి పాత్ర ఎనలేనిదని గుర్తించారు. సంబంధిత అధికారులకు మెమోలు జారీ చేసిన అధికారులు చర్యలు తీసుకుంటారా అనేది అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇసుకాసురుల వెనుక అధికారపార్టీ నేతల అండాదండలు ఉండటంతో వారే ఇప్పుడు ఇసుక అక్రమ రవాణాలో డబ్బులు వసూలు చేసిన ఖాఖీలపై చర్యలకు మోకాలడ్డుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. సెప్టెంబర్ మాసంలో మెమోలు జారీ చేసిన ఇప్పటి వరకు యాక్షన్ లేకపోవడం ఆ వాదనలకు బలం చేకూరుతున్నాయి. గత పోలీస్ కమీషనర్ హయాంలో అవినితి, అక్రమాలకు అండదండలు అందించిన వారిపై కొరడా ఝుళిపించారు. ఇప్పుడు కమీషనరేట్ పరిధిలో 11 మందిపై యాక్షన్ పై డైలమా నెలకొంది. కామారెడ్డి జిల్లాలో అధికారుల చేతిలో చిట్టా ఉన్నా ఎలాంటి చర్యలు లేకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి.
