- గౌరీమాతకు పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, కలెక్టర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో టీఎన్జీఓ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆయా శాఖల మహిళా ఉద్యోగినులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఈ ఉత్సవంలో భాగస్వాములయ్యారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎంతో ఉత్సాహంగా ఆడిపాడారు. బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని గౌరీమాతకు, రంగురంగుల పూలతో ఆకట్టుకునే రీతిలో ముస్తాబు చేసిన బతుకమ్మలకు సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో అందంగా అలంకరించిన బతుకమ్మలు కనువిందు చేస్తూ, పూల పండుగ ప్రాధాన్యతను చాటాయి.

బతుకమ్మ గేయాలను ఆలపిస్తూ మహిళా ఉద్యోగులు, యువతులు, మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆటలాడుతూ ఎంతో ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. దాండియా, కోలాటాలతో బతుకమ్మ సంబురానికి వన్నె చేకూర్చారు. ఈ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సందడి వాతావరణం నెలకొంది. కార్యాలయ పనివేళలు ముగిసినప్పటికీ ఉద్యోగినులు ఎవరూ ఇళ్లకు వెళ్లకుండా ఎంతో హుషారుగా ఈ ఉత్సవంలో పాల్గొని బతుకమ్మ వేడుక ఔన్నత్యాన్ని చాటారు. ఈ ఉత్సవాల్లో టీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు సుమన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

