23.2 C
Hyderabad

తెలంగాణ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పెద్ద దిక్కు

Konda Laxman Bapuji was a pillar of support for the Telangana movement

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  బాపూజీని స్మరించుకోకపోతే తెలంగాణను అవమానించినట్లే

. . .  మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

కమ్మర్‌పల్లి, బతుకమ్మ : 

తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పెద్ద దిక్కుగా నిలిచారని, ఆయన చేసిన సేవలు, త్యాగాలను ఘనంగా స్మరించుకోకపోతే తెలంగాణ సమాజం తనను తాను అవమానించుకున్నట్లేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరూ ముందుకు రాని రోజుల్లోనే తన మంత్రి పదవికి తృణప్రాయంగా రాజీనామా చేసిన అసలైన ధీరశాలి, మొనగాడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. మలిదశ ఉద్యమ తొలినాళ్లలో నాటి సమైక్య పాలకుడు చంద్రబాబు నాయుడు కేసీఆర్ ని, టీఆర్ఎస్ పార్టీని తీవ్ర నిర్బంధాలకు గురిచేస్తూ అణచివేసే ప్రయత్నం చేశారని ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు. ఆ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ అనే పదం పలకడానికే ఎందరో భయపడిన సమయంలో, హైదరాబాద్‌లో ఉద్యమకారులు సమావేశమవడానికి, పార్టీ కార్యాలయానికి ఎవరూ నిలువ నీడ ఇవ్వని తరుణంలో బాపూజీ ధైర్యంగా ముందుకు వచ్చారని తెలిపారు. తన సొంత నివాసమైన ‘జలదృశ్యం’ను తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీకి అప్పగించి ఉద్యమానికి కొండంత అండగా నిలిచారని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. బాపూజీ ఆశీస్సులు, ప్రోత్సాహంతోనే నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ నేతృత్వంలో ప్రజలు కదిలివచ్చి స్వరాష్ట్రాన్ని సాధించుకున్న విషయాన్ని స్వయంగా కేసీఆర్ పలుమార్లు గుర్తుచేసుకున్నారని తెలిపారు. సాధించుకున్న తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.గత పాలకులు బడుగు, బలహీన వర్గాలను కేవలం మాటలకే పరిమితం చేస్తే, కేసీఆర్ హయాంలో అనేక సంక్షేమ పథకాలు, విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని వేముల వివరించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో బీఆర్ఎస్ పార్టీ, తాము ఎల్లప్పుడూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి, వారి సమగ్ర అభివృద్ధికి నిరంతరం కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు, బాపూజీ అభిమానులు, కమర్పల్లి మండల పద్మశాలి బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Konda Laxman Bapuji was a pillar of support for the Telangana movement
 

More articles

Latest article